తల్లిని నరికి చంపిన కొడుకు

28 Sep, 2019 08:27 IST|Sakshi
రక్తపు మడుగులో సంజమ్మ మృతదేహం

సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : ఆటో కొనుక్కోవడానికి డబ్బులివ్వకపోవడంతో కన్నతల్లిని కిరాతకంగా నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో శుక్రవారం చోటు చేసుకుంది. తిలక్‌నగర్‌లోని మదీనా మసీదు సమీపంలో నివాసముంటున్న సంజమ్మ(68)కు విరూపాక్షి, శ్రీనివాసులు, రుక్మిణి, మహాలక్ష్మి సంతానం. ఈమె భర్త రామాంజినేయులు రైల్వే ఉద్యోగి. కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. పెద్ద కొడుకు విరూపాక్షికి తండ్రి ఉద్యోగం వచ్చింది. రెండవ కుమారుడు శ్రీనివాసులుకు పాతగుంతకల్లుకు చెందిన అరుణతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరితో పాటు ఇద్దరు కుమార్తెలను సంజమ్మ తనకు వచ్చే రైల్వే పెన్షన్‌తో పోషిస్తోంది. శ్రీనివాసులు ఏ పనిలోనూ కుదురుగా ఉండలేక ప్రస్తుతం ఇంటి పట్టున ఉంటున్నాడు. ఈనేపథ్యంలో ఆటో కొనివ్వాలని తల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినా అతని మనస్తత్వం తెలిసి ఆమె ఒప్పుకోలేదు. 

ఆటో కొనివ్వలేదని.. 
మస్తానయ్య ఉరుసు ఉండటంతో రెండు రోజుల క్రితం శ్రీనివాసులు తన భార్య అరుణను పుట్టినింటికి(పాత గుంతకల్లు) పంపాడు. సంజమ్మ కూడా గుమ్మనూరులో ఉంటున్న కుమార్తె ఇంట్లో మహాలయ అమావాస్య ఫంక్షన్‌కు వెళ్లి శుక్రవారం ఉదయం మనువరాలితో కలిసి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఒక్కడే ఉన్న శ్రీనివాసులు తల్లి రాగానే మరోసారి ఆటో విషయమై గొడవకు దిగాడు. ఈ విషయమై మాటామాట పెరిగి సహనం కోల్పోయిన శ్రీనివాసులు ఇంట్లో ఉన్న కొడవలితో సంజమ్మపై దాడి చేశాడు. తలపై విచక్షణారహితంగా నరకడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. ఘటనను కళ్లారా చూసిన మనువరాలు(కుమార్తె బిడ్డ) కేకలు వేసుకుంటూ బయటకు రావడంతో చుట్టుపక్క నివాసితులు పెద్ద ఎత్తున గుమికూడారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐ సురేష్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు