ప్రాణం తీసిన పాతప్రేమ!

28 Dec, 2019 17:32 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న కాజీపేట పోలీసులు

పదో తరగతి సమయంలో వన్‌సైడ్‌ లవ్‌

భార్య చనిపోయాక మళ్లీ పరిచయం పేరిట దగ్గరైన వ్యక్తి

కుటుంబీకుల దాడిలో తీవ్రగాయాలతో హతం

చినకోడెపాక వాసి హత్య కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు

కాజీపేట : పదో తరగతి చదువుతున్న ఆమెపై మనస్సు పడ్డాడు. ఆ విషయం తెలిసి కుటుంబీకులు ఆయనను మందలించినా మారలేదు. అలా కాలచక్రం గిర్రున తిరిగిపోగా... ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. అయితే, వేధింపులు భరించలేక ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంకేముంది ఒంటరిగా ఉంటున్న ఆయనకు మళ్లీ తన పదో తరగతి నాటి ప్రేమ గుర్తుకొచ్చింది. అయితే, అప్పట్లో బాలికగా ప్రేమను నిరాకరించిన ఆమె ఇప్పుడు మరో వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ చదువుకున్నప్పటి స్నేహితుడి ప్రేమను ఈసారి అంగీకరించింది. ఆ చనువుతో ఇంటికి వచ్చి వెళ్తుండగా చూడలేని ఆమె భర్త ఇళ్లు వదిలేసి వెళ్లిపోయాడు.. ఇక వీరి వ్యవహరం భరించలేని ఆమె తమ్ముడు, మరిది కలిసి ఆయనను తీవ్రంగా కొట్టగా ఆ గాయాలతో మృతి చెందాడు. దీంతో వీరిద్దరితో పాటు ఆమెపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కాజీపేట పోలీసుస్టేషన్‌లో ఏసీపీ బి.రవీంద్రకుమార్‌ వివరాలు వెల్లడించారు.

చిన్నకోడెపాక టు కాజీపేట..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన సునీత 10వ తరగతి చదువుతున్న సమయంలో నుంచే అదే గ్రామ వాస్తవ్యుడైన పెరుమాండ్ల బిక్షపతి ప్రేమిస్తున్నట్లు చెబుతూ వెంటపడేవాడు. ఆమె కుటుంబ సభ్యులు ఎంతగా హెచ్చరించినా వినలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు సునీతను కాజీపేటకు చెందిన రామరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. అలాగే, బిక్షపతి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవిస్తున్నాడు. ఇంతలోనే 2008లో ఆయన భార్య ఆత్మహత్య చేసుకోగా బిక్షపతిపై రేగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య చనిపోయాక బిక్షపతికి సునీత మళ్లీ గుర్తుకొచ్చింది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లాడు. సునీత బాగానే మాట్లాడేది. దీంతో చనువు పెరగడంతో తరచుగా ఆమె ఇంటికి వచ్చివెళ్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం నచ్చని సునీత భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు నెలలుగా ఆయన ఆచూకీ కూడా దొరకలేదు. అయినా సునీత భిక్షపతితో తన సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సునీత కుటుంబ సభ్యులు పసిగట్టి హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పలుమార్లు పంచాయతీలు పెట్టించారు. అయినా ఇద్దరూ వినడం లేదు.

దాడి.. ఆపై ఆస్పత్రికి..
ఈనెల 21న రాత్రి 10 గంటలకు సునీత కోసం ఆమె ఇంటికి బిక్షపతి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె తమ్ముడు మాడా సదా నందం, మరిది పెరుమాండ్ల సుధాకర్‌కు ఇది నచ్చలేదు. తీవ్రంగా హెచ్చరిస్తూ కర్రలు, రాడ్‌తో బిక్షపతిని బాదడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే 108 సర్వీసుకు ఫోన్‌ చేసి భవనం పైనుంచి కింద పడ్డాడని చెబుతూ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. అయితే, బిక్షపతి స్పృహలోకి వచ్చా క తనపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పగా.. కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో మృతుడి తమ్ముడు సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు సదానందం, సుధాకర్‌తో పాటు వారికి సహకరించిన సునీత శుక్రవారం కడిపికోండ ఆర్వోబీ బ్రిడ్జి సమీపంలో ఉన్నట్లుఅందిన సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, నిందితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా చేధించిన ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌తో పాటు సిబ్బందిని ఏసీపీ రవీంద్రకుమార్‌ ఈ సందర్భంగా అభినందించారు. 

మరిన్ని వార్తలు