రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

3 Jul, 2019 06:23 IST|Sakshi
ప్రమాద స్థలంలోనే మృతిచెందిన సాయికుమార్‌

సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అందివచ్చిన కుమారుడు అందనంత దూరాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఫాస్ట్‌ ఫుడ్‌ కోసం వచ్చి తిరిగి బైక్‌పై వెళ్తూండగా లారీని ఢీకొట్టి ఆర్టీసీ బస్సు కింద పడి ఓ యుకవకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాద ఘటన కాశీబుగ్గ పాతజాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 3:30 నిమిషాలకు జరిగింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 2వ వార్డు జయరామచంద్రపురం (కొత్తూరు) గ్రామానికి చెందిన మార్పు సాయికుమార్‌(20) తన స్నేహితుడు కాశీబుగ్గకు చెందిన చెంచాన గణేష్‌ (20)లు కలిసి పల్సర్‌ బైక్‌పై వస్తూ పాత జాతీయ రహదారిలో ఉన్న టీకేఆర్‌ కల్యాణ మండపం వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయారు.  సాయికుమార్‌ తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిపోడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గణేష్‌ బస్సు మధ్యలో ఉండిపోవడంతో కాళ్లపై నుంచి చక్రాలు వెళ్లాయి. ఒక కాలు విరిగింది. మరో కాలి పాదం నుజ్జునుజ్జు అయింది. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును అక్కడికక్కడే నిలిపివేయడంతో గణేష్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన గణేష్‌ను 108లో పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలకు రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. 

గుండెలు అవిసేలా రోదించిన తల్లిదండ్రులు
పలాస–కాశీబుగ్గ 2వ వార్డు జయరామచంద్రపురం గ్రామానికి చెందిన మార్పు వెంకటరమణ, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె శోభారాణికి ఇటీవల వివాహం అయింది. సాయికుమార్‌ అలియాస్‌ ‘సాయి’ స్థానికంగా ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం (ఎంపీసీఎస్‌) చదువుతున్నాడు. మరోవైపు విదేశాలకు వెళ్లడానికి వెల్డింగ్‌ సైతం నేర్చుకుంటున్నాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు దూసుకువచ్చింది. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తండ్రి వెంకటరమణ మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించాడు. ఈ ఘటన çపలువురిని కలిచివేసింది. తల్లి సావిత్రి కుమారుడును చూసి మూర్చపోయింది. ఆమెకు స్థానికులు సపర్యలు చేశారు. 

పరారైన లారీని పట్టుకున్న స్థానికులు 
పద్మనాభపురం నుంచి కాశీబుగ్గ మూడు రోడ్డు కూడలి వైపు బైక్‌పై సాయి, గణేష్‌ వస్తూ వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తున్నారు. ఈ సమయంలో పలాస డిపోకు చెందిన హరిపురం–పలాస పల్లె వెలుగు బస్సును దాటుకుంటూ వచ్చారు. ఎదురుగా వస్తున్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయారు. ఆర్టీసీ బస్సు సాయి పైనుంచి దూసుకుపోయింది. సంఘటన జరిగిన వెంటనే లోడ్‌తో ఉన్న లారీ పరారైంది. సుమారు కిలో మీటరు దూరం బైక్‌లపై వెళ్లిన స్థానికులు లారీని పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు కింద పడి ప్రమాదం జరిగినప్పటికీ లారీ కారణం కావడంతో కాశీబుగ్గ పోలీసులు లారీ డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించారు. భారీ వాహనాలకు పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలలో అనుమతులు లేనప్పటికీ ఇటువంటి సంఘటనలకు కారణంగా మారుతున్నాయి. జంటపట్టణాలలో వాహనాల రద్దీ అధికంగా ఉన్నా రోడ్డు విస్తరణ, సింగిల్‌ వే ఏర్పాటు చేయకపోవటంతో తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు