ముగ్గురిని బలిగొన్న వివాహేతర బంధం

7 Aug, 2018 13:06 IST|Sakshi
శిథిలాల మధ్య మృతదేహం 

ముగ్గురి సజీవ దహనం

తండ్రితో వివాహేతర సంబంధం సాగిస్తుందని మహిళకు నిప్పంటించిన యువకుడు

తండ్రితోపాటు  మహిళ మృతి

మంటలతో గ్యాస్‌  సిలిండర్‌ పేలి నిందితుడి  నానమ్మ దుర్మరణం

వరంగల్‌ రూరల్‌ జిల్లా కంఠాత్మకూరులో ఘటన

ఆత్మకూరు(పరకాల) వరంగల్‌ : తన తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ యువకుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. క్షణికావేశంతో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ముగ్గురి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనలో మహిళతోపాటు నిందితుడి తండ్రి, నానమ్మ కూడా మృతిచెందా రు. దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50), తన భార్య కౌసల్య, కుమారుడు, కుమార్తెతో హన్మకొండలోని ఇందిరానగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు.

ప్లంబర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కంఠాత్మకూరు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన వితంతువు పోతరాజు సుమలత(38)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు గతంలో హసన్‌పర్తికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కాగా భర్త మృతిచెందడంతో ప్రస్తుతం పైడిపల్లి సమీపంలో నివాసముంటోంది. ఈ క్రమంలో సుమలత, కుమారస్వామి పరిచయం పెరిగి తరచు కంఠాత్మకూరుకు వచ్చివెళ్తున్నారు.

అప్పటి నుంచి అతడు హన్మకొండకు రాకుండా కుటుం బాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో కుమారస్వామి కుమారుడు కార్తీక్‌ సుమలతపై కక్ష పెంచుకున్నాడు. ఆదివారం అతడు తన తండ్రికి ఫోన్‌ చేయగా కంఠాత్మకూరులో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కార్తీక్‌ ఆగ్రహంతో వెంటనే కంఠాత్మకూరుకు బయల్దేరాడు. నేరుగా రాత్రి ఇంట్లోకి పెట్రోల్‌ డబ్బాతో ప్రవేశించాడు. ముందుగా సుమలతపై పెట్రోల్‌ పోస్తుండగా కుమారస్వామి అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో కుమారస్వామిపై కూడా పెట్రోల్‌ పడింది.

వెంటనే సుమలతకు కార్తీక్‌ నిప్పంటించాడు. దీంతో కుమారస్వామి మంటలార్పే ప్రయత్నం చేయగా అతడిపై కూడా పెట్రోల్‌ ఉండడంతో అతడు కూడా అగ్నికీలల్లో దగ్ధమయ్యాడు. అదేసమయంలో మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగిసిపడడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన జరుగుతుండగానే కుమారస్వామి తండ్రి లింగయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

పోలీసుల అదుపులో నిందితుడు?

నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్‌బాబు తెలిపారు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డీసీపీ

సంఘటనా స్థలాన్ని డీసీపీ వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలిన మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటన వివరాలను  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడిగి తెలుసుకున్నారు.

కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే..

వేరొక మహిళతో కుమారస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే కార్తీక్‌ సజీవ దహనానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోలేదని, దీంతో కార్తీక్‌ తరచుగా ఇదే విషయంలో తండ్రితో గొడవపడేవాడని స్థానికులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు