గొంతుకోసి.. మెడ నరికి..

20 Apr, 2018 11:47 IST|Sakshi
హత్యకు గురైన గోసాల సత్యనారాయణ

రాధేయపాలెం (రాజానగరం) : ఎప్పటిలాగే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దండుగులు గొంతు కోసి, మెడ నరికి అతి కిరాతకంగా హతమార్చారు. వివాదరహితుడిగా పేరున్న ఈ వ్యక్తిని ఎవరు హతమార్చారో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. రాజానగరం మండలం, రాధేయపాలెంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా..

రాధేయపాలేనికి చెందిన గోసాల సత్యనారాయణ (57) గ్రామ శివారున ఉన్న పొలంలో నాలుగేళ్లుగా కాపలా ఉంటున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అంకం గోపి అనే వ్యక్తి కొనుగోలు చేసిన 18 ఎకరాల పొలంలో ఎనిమిది ఎకరాల వరకు రిజిస్టర్‌ కావడం, మిగిలిన 10 ఎకరాలు సకాలంలో రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో క్రయ, విక్రయదారుల మధ్య తలెత్తిన వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మొదట కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం అంకం గోపి ఆధీనంలో ఉన్న ఈ పొలంలో కాపలాదారుడిగా సత్యనారాయణను నియమించారు.

అప్పటి నుంచి తన విధులు తాను చేసుకుపోతున్న అతడికి అవతలి వర్గం నుంచి కూడా ‘నీవు కాపలాగా ఉండవద్దు’ అంటూ బెదిరింపులు వచ్చాయి. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న హతుడు పామాయిల్‌ తోటకు నీళ్లు పెట్టేందుకు ఉదయం ఆరు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన రేలంగి శ్రీనును తీసుకువెళ్లాడు. పామాయిల్‌ తోటకు నీరు పెట్టిన అనంతరం టిఫిన్‌ తీసుకురమ్మని అతడిని పంపాడు.

టిఫిన్‌ తీసుకుని తిరిగి వెళ్లే సరికి చనిపోయి రక్తపు మడుగులో మృతి చెంది ఉన్న సత్యనారాయణను చూసి భయంతో  ఊళ్లోకి పరుగు తీసి, విషయాన్ని అందరికీ తెలిపాడు. సమాచారం తెలుసుకున్న  గ్రామస్తులతోపాటు డీఎస్పీ నాగరాజు, రాజానగరం సీఐ వరప్రసాద్, ఎస్సై జగన్‌మోహన్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు డాగ్‌ స్క్వాడ్‌ని రప్పించారు. అయితే అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లిన స్కాడ్‌ మరలా వెనక్కి వచ్చేయడంతో క్లూస్‌ దొరకలేదు. 

మృతుడి కుటుంబానికి పరిహరం చెల్లించాలి..

మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు మృతుడి కుటుంబానికి పరిహరం చెల్లించి, మృతదేహాన్ని కదిలించాలని పట్టుబట్టారు. పొలంలో కాపాలాగా నియమించడంలో మధ్యవర్తిగా ఉన్న మాజీ సర్పంచ్‌ నాగమునేశ్వరరావును కూడా ఈ విషయమై నిలదీశారు. చివరకు పొలం స్వాధీనంలో ఉన్న అంకం గోపి గ్రామాంతరంలో ఉండడంతో వేరొకరు ప్రతినిధిగా వచ్చారు.

మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు పొలం యజమాని వైపు నుంచి స్పందన రాకపోవడంతో విషయం తేలేవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి కదలనిచ్చేది లేదంటూ పట్టుబట్టారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉభయ వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా