ఆస్తి కోసం తండ్రిని, తమ్ముళ్లని చంపాడు!

29 Jan, 2018 08:53 IST|Sakshi
సంఘటన స్థలంలో శ్రీశైలం, రామస్వామి మృతదేహాలు

తల్లి చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయింది.. తండ్రి వృద్ధుడు.. ఏ పనీ చేయలేడు.. తోడబుట్టిన తమ్ముళ్లు అనే ధ్యాస, వారిని తానే చూసుకోవాలనే బాధ్యత మరిచిన ఓ అన్న కసాయిగా మారి.. వారిని కర్కశంగా కొట్టిచంపాడు.. చిన్ననాటి నుంచే జులాయిగా తిరిగే ఆ యువకుడు కన్నతండ్రి మాటలను పెడచెవిన పెడుతూ మద్యానికి బానిసగా మారిపోయాడు.. తనకు భూమిలో వాటా ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.. ఈ క్రమంలోనే మానవ మృగంలా మారి.. తండ్రి, ఇద్దరు తమ్ముళ్లను రాళ్లతో అతి కిరాతకంగా మోది చంపాడు.. ఈ అమానవీయ సంఘటన ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో ఆదివారం తీవ్ర కలకలం రేపింది..  

ఉప్పునుంతల (అచ్చంపేట): మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన సామ భాస్కరయ్య(60), భూలక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు మల్లేష్, శ్రీశైలం(20), రామస్వామి(18). అయితే భాస్కరయ్య భార్య భూలక్ష్మమ్మ ఇంట్లో సర్దుబాటు లేక గత పదిహేళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన తమ్ముళ్ల వద్ద వంగూరు మండలం అన్నారంలో ఉంటుంది. అప్పటి నుంచి తండ్రితోపాటు ము గ్గురు కుమారులు మాత్రమే మామిళ్లపల్లిలో ఉండేవారు. వీరిలో పెద్ద కొడుకు మల్లేష్‌ ఏ పనిచేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో రెండో కుమారుడు శ్రీశైలం తండ్రితో కలిసి తమకున్న 4 ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుండగా.. చిన్నకుమారుడు రామస్వామి తెలకపల్లిలో ని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతు న్నాడు. ఈ క్రమంలో పెద్దకొడుకు మల్లేష్‌ తర చూ ఇంట్లో వస్తువులు, డబ్బులను దొంగిలిస్తూ మద్యం తాగేవాడు. అలా గే తన వాటాకు వచ్చే పొలాన్ని పంచి ఇవ్వమని తరచూ  తండ్రి, తమ్ముళ్లతో గొడవపడేవాడు.

కేసు నమోదు.. 
సమాచారం తెలుసుకున్న అచ్చంపేట డీ ఎస్పీ రవికుమార్, సీఐ రామకృష్ణ, లింగాల, బల్మూరు ఎస్‌ఐలు విష్ణు, వెంకన్న, ఉప్పునుంతల ఏఎస్‌ఐ నాగశేషా జీ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో వివరాలు సేకరించారు. ఈ మేరకు నిందితుడు మల్లేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నామని సీఐ రామకృష్ణ తెలి పారు. శవా లను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

జులాయిగా తిరుగుతూ.. 
సామ మల్లేష్‌ చిన్నప్పటి నుంచి పెద్దల భయం లేకుండా పెరగడంతో జులాయిగా తిరుగుతూ కసాయిగా మారాడని గ్రామస్తులు ఆరోపించారు. తల్లి చిన్నప్పుడే వదిలిపెట్టి పోవడం, తండ్రి మాట పెడచెవిన పెట్టి అడ్డదిడ్డంగా తిరుగుతూ పెరిగిన మల్లేష్‌ చివరకు తన సోదరులతోపాటు తండ్రిని చంపే స్థాయి చేరాడన్నారు. ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగడం, జులాయిగా తిరగడం, ఇంట్లో డబ్బులు, పొలం వద్ద ఇతర సామగ్రి దొంగిలించడం వంటివి చేసేవాడన్నారు. అలాగే తండ్రి, తమ్ముళ్లను డబ్బుల కోసం వేధిస్తూ పొలంలో పశుగ్రాసానికి నిప్పుపెట్టిన సంఘటనలు సైతం ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే తల్లి భూలక్ష్మమ్మను కూడా మల్లేష్‌ కొట్టడంతోనే ఆమె వెళ్లిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

కుటుంబాన్ని నెట్టుకొచ్చిన శ్రీశైలం.. 
చిన్నతనంలోనే తల్లి పిల్లలను విడిచి వెళ్లిపోవడం, అన్న ఎవరి మాట వినకపోవడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో నడిపి కొడుకు శ్రీశైలం తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ తమ్ముడు రామస్వామిని చదివిస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇతరుల వద్దకు కూలీ పనికి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రామస్వామి సైతం సెలవు రోజుల్లో తండ్రి, అన్నకు పొలం పనుల్లో సాయం చేసేవాడు. చివరకు అన్న మల్లేష్‌ అనారోగ్యానికి గురైన సమయంలో కూడా డబ్బులు ఖర్చుచేసి బాగుచేయించినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తమ్ముళ్లను చంపడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయంటూ బోరుమన్నారు. 

పొలంలోనే దారుణం
ఇదిలా ఉండగా శనివారం రాత్రి తమ్ముళ్లు శ్రీశైలం, రామస్వామి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పంటకు కాపలాగా వేర్వేరుచోట్ల పడుకున్నారు. అర్ధరాత్రిపూట అక్కడికి చేరుకున్న మల్లేష్‌ ఇద్దరినీ పడుకున్న దగ్గరే రాళ్లతో తలపై మోది చంపాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తండ్రి భాస్కరయ్యను నిద్రలేపి నమ్మించి పొలం వద్దకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో అతని తలపై రాళ్లతో మోది చంపేశాడు. అయితే పొలం వద్ద నుంచి ఇంటికి వస్తున్న గ్రామానికి చెందిన మల్లయ్యకు తండ్రిని తీసుకుని పొలం వద్దకు తీసుకువెళ్తూ మల్లేష్‌ కనిపించాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నిందితుడు మల్లేష్‌ అన్నారంలో ఉన్న తన మేనమామ వెంకటయ్యకు ఫోన్‌చేసి ఇద్దరు తమ్ముళ్లను, తండ్రిని చంపినట్లు చెప్పాడు. దాంతో ఆ విషయం గ్రామంలో పాకడంతో వారి దాయాదులు, గ్రామస్తులు వెళ్లి పొలంలో వెతకగా ముగ్గురు శవాలు మూడు చోట్ల పడి ఉన్నాయి. ఆ సమయంలోనే నిందితుడు మల్లేష్‌ తెల్కపల్లిలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న అతని పెద్దనాన్న కొడుకు రామస్వామి అక్కడికి వెంటనే వెళ్లి మల్లేష్‌ను పట్టుకుని తెలకపల్లి పోలీసులకు అప్పగించాడు. 

మరిన్ని వార్తలు