తమ్ముడిని కడతేర్చిన అన్న

16 Sep, 2019 08:42 IST|Sakshi
చినమస్తానయ్య (ఫైల్‌)

సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఇల్లు పంపకం విషయంలో సొంత అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తమ్ముడి ప్రాణం తీసింది. ఈ ఘటన చేజర్ల మండలంలోని కాకివాయిలో ఆదివారం జరిగింది. స్థానికులు, చేజర్ల ఎస్సై ఎన్‌.కాంతికుమార్‌ సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మస్తానయ్య, చినమస్తానయ్య ఇద్దరూ సోదరులు. వీరికి మరో చెల్లెలు ఉంది. కాలనీ ఇల్లు మంజూరు కావడంతో రెండేళ్ల క్రితం నిర్మించుకున్నారు. అప్పటికే ఓ ఇల్లు ఉండగా కాలనీ ఇల్లు చెల్లెలికి ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చిన మస్తానయ్య (40) ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయినా చెల్లెలుకు, తల్లికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఎలాంటి ఆదరువు లేని చెల్లెలకు కాలనీ ఇల్లు ఇద్దామని చెప్పినా ఒప్పుకోక పోవడంతో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మరోసారి అన్నదమ్ముల మధ్య ఇంటి విషయమై గొడవ జరిగింది. ఆవేశంలో అన్న మస్తానయ్య తమ్ముడు చినమస్తానయ్యను కర్రతో తలపై కొట్టడంతో తల పగిలి తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం తెల్లవారు జామున చెన్నైకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న చేజర్ల ఎస్సై ఎన్‌ కాంతికుమార్‌ గ్రామానికి చేరుకుని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు