కుక్కే కదా అని కాల్చేశాడు

23 Dec, 2019 04:13 IST|Sakshi

మొరుగుతూ ఇబ్బంది పెడుతోందని గన్‌తో కాల్చివేత

సరూర్‌నగర్‌ బాపూకాలనీలో బ్యాంక్‌ ఉద్యోగి దారుణం.. కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రోజూ మొరుగుతూ ఇబ్బంది పెడుతుందన్న కారణంతో బర్రెల షెడ్డులో కాపలాగా ఉంటున్న కుక్కను ఓ వ్యక్తి ఎయిర్‌గన్‌తో కాల్చి చంపిన ఘటన సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలోని బాపూ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎడమ భుజంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. వివరాలు.. రాజు, దేవేందర్, సుదర్శన్‌ ముగ్గురు అన్నదమ్ములు కలసి ఓల్డ్‌ సరూర్‌నగర్‌ చౌడీ వద్ద బర్రెల షెడ్డును నిర్వహిస్తున్నారు. ఈ షెడ్డులో జాకీ అనే కుక్క కాపలాగా ఉంటోంది.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ షెడ్డు నుంచి బయటకు వచ్చిన కుక్క.. బాపూ కాలనీలోని జిమ్‌కోచ్, బ్యాంక్‌ ఉద్యోగి అవినాశ్‌ కరణ్‌ ఇంటికి వెళ్లింది. దీంతో అతడు తన వద్ద ఉన్న ఎయిర్‌ గన్‌తో కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో కుక్క యజమానులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ 429, 336 సెక్షన్లతోపాటు ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాల్టీ యాక్ట్‌ సెక్షన్‌–11 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎయిర్‌గన్‌ కలిగి ఉండటంతో ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు