కోరలు చాచిన ప్రేమోన్మాదం

16 Jun, 2019 08:07 IST|Sakshi
చెన్నై చేట్‌పేట్‌లో గాయపడిన తేన్‌మొళి, సురేందర్‌

సాక్షి, చెన్నై: ప్రేమోన్మాదం కోరలు చాచింది. తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో వరుసకు చెల్లెల్ని ఓ ఐటీ ఉన్మాది తిరుచ్చిలో అతికిరాతకంగా హతమార్చాడు. మూడేళ్లు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగి, ఇప్పుడు పెళ్లి నిరాకరించడంతో మరో ప్రేమికుడు ఉన్మాదిగా మారాడు. చెన్నై చేట్‌పేట్‌ రైల్వే స్టేషన్‌లో ప్రియురాల్ని హతమార్చే యత్నం చేశాడు. ప్రయాణికులు పట్టుకునేందుకు యత్నించగా, తప్పించుకునే క్రమంలో రైలు ఢీకొని ఆస్పత్రి పాలయ్యాడు. అయితే, చెన్నై చేట్‌పేట్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. అలాగే, మరో మారు చెన్నైలోని రైల్వేస్టేషన్లలో భద్రతలోని డొల్లతనం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో యువతుల మీద రాష్ట్రంలో వేధింపులు, కిరాతకాలు నానాటికి పెరుగుతున్నాయి. ఒన్‌సైడ్‌ ప్రేమ అంటూ కొందరు, తనను విస్మరించిందంటూ మరి కొందరు యువకులు ఉన్మాదుల అవతారం ఎత్తే పనిలో పడ్డారు. ఈ పరిణామాలు యువతుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో కొందరు యువత ఒడిగడుతున్న ఘాతుకాలు ఆందోళన రేపుతున్నాయి. ఒన్‌సైడ్‌ ప్రేమకు బలి అయ్యే వారు కొందరు అయితే, ప్రేమపేరుతో చెట్టా పట్టలు వేసుకుని పెళ్లి సమయానికి  ప్రియుల్ని దూరం పెట్టే వాళ్లు మరి కొందరు. ఇక, ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే, పరువు హత్యలు. ఇది రాష్ట్రంలో ప్రేమ పేరుతో సాగుతున్న ఉన్మాదం. తాజాగా వెలుగు చూసిన ఘటనలో ఒకటి మాత్రం చెన్నైలోని రైల్వేస్టేషన్లలో కొరవడి భద్రతను మరోమారు స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం స్వాతి అనే ఐటీ ఉద్యోగిని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో అతి కిరాతకంగా హత్య చేయబడింది. ఈ ఘటనతో అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పనిసరి అని ప్రకటించినా, ఆచరణలో విఫలం అయ్యారు. ఇందుకు కారణం అదే నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న చేట్‌పేట్‌ రైల్వేస్టేషన్‌లో మరో ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోవడం విచారకరం.

రైల్వేస్టేషన్లో ప్రేమోన్మాది కిరాతకం..
ఈరోడ్‌కు చెందిన తేన్‌ మొళి చైన్నై ఎగ్మూర్‌లోని ఓ మహిళా హస్టల్‌లో ఉంటూ కీల్పాకం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తూ వస్తున్నది. ఈమె ప్రతిరోజూ ఎగ్మూర్‌ నుంచి చేట్‌పేట్‌కు రైళ్లో పయనిస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ సమీపంలోని సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయానికి వెళ్లడం జరుగుతోంది. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆమె చేట్‌పేట్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆమెను సమీపించిన ఓ యువకుడు కాసేపు మాట్లాడుతుండడంతో అక్కడున్న కొద్ది మంది ప్రయాణికులు వారిని పట్టించుకోలేదు. ఇందుకు కారణం సాదారణంగా చేట్‌పేట్‌ రైల్వేస్టేషన్‌లో జన సంచారం తక్కువగా ఉండడం, ఇక్కడ ప్రేమజంటల గంటల కొద్ది కాలక్షేపాలు సహజమే కావడం.

ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, క్షణాల్లో ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న అతి పెద్ద కత్తితో ఆ యువతిపై దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న అక్కడున్న ప్రయాణికులు అడ్డుకునే యత్నం చేశాడు. అప్పటికే ఆమె ముఖం, చేతికి గాయాలయ్యాయి. కూత వేటు దూరంలో ఉన్న యువకులు అతగాడ్ని పట్టుకునేందుకు పరుగులు తీయడంతో ఆ ఉన్మాది తప్పించుకునే యత్నం చేశాడు. ప్లాట్‌ఫాంపై నుంచి ట్రాక్‌ మీదుగా తప్పించుకునే యత్నం చేయగా, అదే సమయంలో అటు వైపుగా వచ్చిన ఎలక్ట్రిక్‌ రైలు ఢీకొంది. దీంతో అతగాడి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఉన్మాది చేతిలో  తీవ్రంగా గాయపడ్డ తేన్‌మొళిని కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలతో పడి ఉన్న ఆ ఉన్మాదిని జీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎగ్మూర్‌ రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

మూడేళ్లు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగి..
విచారణలో ఆ ఉన్మాది పేరు సురేంద్రన్‌గా తేలింది. తేన్‌మొళి, సురేంద్రన్‌ ఒకే ఊరికి చెందిన వాళ్లు. ఈ ఇద్దరు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల తన తల్లిదండ్రులతో వెళ్లి తేన్‌మొళి పెద్దల్ని కలిశాడు. అయితే, వారు నిరాకరించడంతో ఈ ప్రేమకు బ్రేక్‌ పడింది. అదే సమయంలో తేన్‌ మొళికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో టైపిస్టుగా ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. దీంతో సురేంద్రన్‌ను ఆమె పూర్తిగా పక్కన పెట్టింది. తనతో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగి, పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఆమెను హతమార్చేందుకు సురేంద్రన్‌ యత్నించినట్టు విచారణలో తేలింది.

మరోమారు వెలుగులోకి నిఘా లోపం..
గతంలో జరిగిన స్వాతి హత్యతో రైల్వే పోలీసు పాఠం నేర్వలేదు. రైల్వే స్టేషన్లను నిఘా మయం చేస్తామని ప్రకటించి, విస్మరించారు. తాజాగా చెన్నైలోని రైల్వేస్టేషన్‌లో హత్యయత్నం ఘటన చోటుచేసుకోవడంతో మరో మారు భద్రతా లోపం తేట తెల్లమైంది. చేట్‌పేట్‌ రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. ఉన్న ఒకటి రెండు పని చేయకపోవడంతో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. అలాగే, గంటల తరబడి అక్కడ ప్రేమ జంటల కాలక్షేపం చేస్తున్నా, మందలించే వాళ్లూ లేరు. భద్రతా విధుల్లో సిబ్బంది లేరని చెప్పవచ్చు.  తాజా, ఘటనతో రైల్వే యంత్రాంగంపై మీడియా దుమ్మెత్తి పోసే పనిలో పడింది. సమాచారం అందుకున్న రైల్వే డీజీపీ శైలేంద్రబాబు రంగంలోకి దిగారు. ఆ స్టేషన్‌ పరిసరాల్ని పరిశీలించారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించారు. అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కొన్ని స్టేషన్లలో ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతున్నట్టు మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఒన్‌ సైడ్‌ లవ్‌.....కిరాతకం
తిరుచ్చి అన్నానగర్‌కు చెందిన పుదియ తమిళగం కట్చి నాయకుడు అయ్యప్పన్‌ కుమార్తె మలర్‌ వెళి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అయ్యప్పన్‌కు సమీప బంధువు కుమారుడైన బాలమురళీ కార్తీక్‌ చెన్నైలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. మలర్‌వెళికి ఇతడు వరుసకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య అన్న చనువుతో బాలమురళితో మలర్‌ వెళి మెలిగేది. అయితే, వావి వరుస మరచిన కార్తీక్‌ మలర్‌ వెళిని ప్రేమించడం మొదలెట్టాడు. ఆమే సర్వస్వం అన్న స్థాయికి చేరాడు. రెండేళ్ల క్రితం ఓ రోజున తన ప్రేమను మలర్‌వెళికి చెప్పే శాడు. షాక్‌కు గురైన మలర్‌ వెళి అన్నయ్యను మందలించింది. ఇంట్లో చెప్పేస్తానని హెచ్చరించింది. అయినా, కార్తీక్‌ తగ్గ లేదు. రోజురోజుకు కార్తీక్‌ నుంచి వేధింపులు పెరగడంతో విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి ఆమె  తీసుకెళ్లింది. దీంతో వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య వివాదానికి దారి తీసే పరిస్థితులు కల్పించింది. అయితే, పెద్దల సలహాతో విషయం మరీ పెద్దది కాకుండా, ఇరు కుటుంబాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు.

ఆగమేఘాలపై కార్తీక్‌కు మరో యువతితో వివాహం కూడా చేశారు. ఈ దంపతులకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు. అయితే, మలర్‌ వెళి మీద తన ప్రేమను మరచి పోని కార్తీక్‌ ఉన్మాదిగా మారాడు. ఆమెను పొంది తీరాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. చెన్నై నుంచి శుక్రవారం తిరుచ్చికి వచ్చిన కార్తీక్‌ కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న మలర్‌ వెళిని అడ్డుకున్నాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో అతి కిరాతకంగా నరికి పడేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న రోడ్డు మీద వెళ్తున్న వాళ్లు అతడ్ని పట్టుకునే యత్నం చేశారు. ఉడాయించిన కార్తీక్‌ సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడి ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. రోడ్డు మీద రక్తపు మడుగులో కుప్పకూలిన మలర్‌ వెళిని చూసిన జనం అతడ్ని వెంటాడి మరీ పట్టుకుని చితక్కొట్టారు. జనం దెబ్బలకు ఆ ఉన్మాది సగం చచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. మలర్‌ వెళిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై తిరుచ్చి తేనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు