కట్టుకోబోయే వాడే కడతేర్చాడు 

4 Feb, 2018 07:36 IST|Sakshi
వివరాలు వెలడిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు

నాగోలు: కాబోయే భార్యను అనుమానంతోనే అంతం చేశాడు. నగరంలో సంచలనం రేపిన అనూష హత్య కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశాడు. ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజానగర్‌ తండాకు చెందిన అనూష (23) బీటెక్‌ పూర్తి చేసింది. కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం నగరంలో శిక్షణ తీసుకుంటూ హయత్‌నగర్‌లోని తన సోదరి వద్ద ఉంటోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి తండాకు చెందిన అంగోత్‌ మోతీలాల్‌ (24) అనూషకు దూరపు బంధువు. బీటెక్‌ పూర్తి చేసి శంషాబాద్‌లోని ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో టెలీకాలర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

2013 నుంచి అనుష, మోతీలాల్‌లు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని పెద్దలకు  చెప్పడంతో ఇరు వర్గాలు ఒప్పుకుని నిశ్చితార్ధం చేశారు. కట్నం కింద 8 లక్షల నగదు ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే అనూష కానిస్టేబుల్‌ శిక్షణ కోసం నగరానికి వెళ్లడం, ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన మోతీలాల్‌ ఆమె ఫోన్, వాట్సాప్‌ మెసేజ్‌లను పరిశీలించాడు. ఇంతలోనే అనూష తాను గర్భవతిని అని, పెళ్లి చేసుకోవాలని మోతీలాల్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మోతీలాల్‌ ఇంటర్వ్యూ ఉందని గ్రామంలో ఉన్న అనూషను ఈ నెల 24న నగరానికి తీసుకొచ్చాడు. హయత్‌నగర్‌ పరిసర ప్రాంతాలలో తిరిగి మిధాని కాలనీలో నివాసముండే అనూష సోదరి చిట్టెమ్మ ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సోదరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 28వ తేదీన మోతీలాల్‌ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనూషపై అనుమానం పెంచుకున్న మోతీలాల్‌ గర్భం, వివాహం విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.

దీంతో ఆగ్రహించిన మోతీలాల్‌ బండరాయితో అనూషపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అనూష అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు ఇంటికి రాకపోగా, ఇద్దరి ఫోన్‌లు ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో నగరంలో ఉండే సోదరుడు శ్రీకాంత్‌కు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఇంటికి వెళ్లి పరిశీలించగా అనూష రక్తపుమడుగులో కనిపించింది. దీంతో శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు మోతీలాల్‌ను శనివారం సాగర్‌రింగురోడ్డులోని టీకేఆర్‌ కమాన్‌ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ రవిందర్‌రెడ్డి, హయత్‌నగర్‌ సీఐ సతీష్, జి.రామన్‌గౌడ్, పాల్గొన్నారు.    

ఎస్‌ఐ రాంలాల్‌ ప్రోద్బలంతోనే హత్య..
మోతీలాల్‌ సోదరుడు రాంలాల్‌ నగరంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడని, అతని మరదలిని మోతీ లాల్‌కు ఇవ్వడం కోసమే తన కూతురిని హత్య చేయిం చాడని అనూష తల్లిదండ్రులు డీసీపీ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక రాంలాల్, శంకర్, చిన్నాల హస్తం ఉందని వాపోయారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా