ప్రాణం మీదికి తెచ్చిన భూవివాదం

9 Jul, 2020 12:40 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్‌

రోడ్డు మీద కత్తితో మహిళపై విచక్షణారహితంగా దాడి  

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో ఘటన

గోపాల్‌పేట(వనపర్తి): సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కళ్ల ముందు ఓ మనిషిని (అందులోనూమహిళ) కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్నా సినిమా షూటింగ్‌లా చూస్తున్నారే గానీ వారించేవారు కరువయ్యారు. జిల్లాలోని గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన అర్జున్‌రావు అదే గ్రామానికి చెందిన అనంతరావు భార్య రత్నమ్మ(60)పై మటన్‌ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన రత్నమ్మను వనపర్తి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం..  బుద్దారానికి చెందిన అర్జున్‌రావుకు 375, 376 సర్వే నంబర్లలో 2.28గుంటల భూమి ఉండేది. ఈ భూమిని 2010లో అనంతరావు మధ్యవర్తిగా ఉండి దాయాది కుటుంబసభ్యులకు అమ్మించాడు. 2018లో 2.28 ఎకరాల అమ్మిన భూమి సమీపంలోని 405, 406 సర్వే నంబర్లలోని 13గుంటలు, 15గుంటల భూమిని వేరొకరి పేరుమీద పట్టా చేయించాడని అర్జున్‌రావు ఆరోపిస్తూ గ్రామ పెద్దల వద్ద ఇటీవల పంచాయితీకి పెట్టాడు. ‘నీ పొలం అమ్మినట్లయితే నా పొలంలో 28గుంటలు తీసుకో’ అని అనంతరావు గ్రామస్తుల సమక్షంలో కాగితంపై రాసిచ్చాడు. అప్పటినుంచి తనకు రాసిచ్చిన ప్రకారం భూమిని ఇవ్వాలని వాదనలు జరిగాయి. ఈ విషయంపై ఐదురోజుల కిందట గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అర్జున్‌రావు ఫిర్యాదు చేశారు. (మహిళపై కత్తితో పదేపదే దాడి)

రెండు కుటుంబాలకు చెందిన వారు కూర్చొని మాట్లాడుకోవాలని ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ సూచించారు. ఈ విషయంపై బుధవారం ఉదయం గ్రామంలోని పాలకేంద్రం వద్ద అర్జున్‌రావు అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు, అతడి మనువడు ప్రశాంత్‌రావు కలిసి అనంతరావుతో వాదనలకు దిగాడు. ఇది కాస్త ఘర్షణలకు దారితీసింది. గొడవ పెరగడంతో అర్జున్‌రావు అనంతరావు తలపై కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో అనంతరావు భార్య రత్నమ్మ అడ్డువచ్చింది. అప్పటికే ఆవేశంగా ఉన్న అర్జున్‌రావు వెంట తీసుకున్న మటన్‌ కత్తితో రత్నమ్మను విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన స్థానికుడు మేకల సహదేవుడుపై కత్తితో దాడి చేయగా ఆయన గాయపడ్డాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు 100డయల్‌ చేసి సమాచారం చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు రత్నమ్మ భర్త అనంతరావు ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అర్జున్‌రావు, అతని భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు, మనువడు ప్రశాంత్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ సూర్యనాయక్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసున్నారు. 

చూస్తుండి పోయిన జనం   
బుద్దారంలో ఉదయం బాధితురాలు రత్నమ్మపై అర్జున్‌రావు కత్తితో దాడి చేస్తుండగా అక్కడ దాదాపు పది నుంచి 15మంది వరకు ఉన్నారు. సహదేవుడు ఒక్కడే ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ మిగిలిన వారు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు.  

 పథకం ప్రకారమే కత్తి, కర్రతో దాడి
వనపర్తి క్రైం: బుద్దారం ఘటనపై బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. తమకు తెలియకుండా భూమి విషయంలో మోసం చేశాడని, బంధువులపై కోపం పెంచుకుని పథకం ప్రకారమే అర్జునయ్య తమ బంధువులైన అనంతరావుపై కర్రతో దాడి చేశారు. అడ్డోచ్చిన  భార్య రత్నమ్మలపై మటన్‌ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు చెప్పారు. ప్రాణాలతో కోట్టుమిట్టాడుతున్న ఆమెను, గాయపడిన అనంతరావును వనపర్తి జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం నిందితులను వారి తోటలో అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వనపర్తి సిఐ సూర్యనాయక్, వనపర్తి, గోపాల్‌పేట ఎస్‌ఐలు వెంకటేష్‌గౌడ్, రామన్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు