తల్లి మృతదేహంతో 18 రోజులు!

26 Dec, 2018 12:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: తల్లి మృతదేహాన్ని ఖననం చేయడానికి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న కొడుకు ఆ శవంతోనే ఒంటరిగా 18 రోజులు గడిపిన ఘటన కోల్‌కతాలో తాజాగా వెలుగుచూసింది. వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆదివారం పోలీసులు సాల్ట్‌లేక్‌లోని ఆ ఇంటి తలుపులు బద్ధలు కొట్టేసరికి 30 ఏళ్ల మైత్రేయ భట్టాచార్య.. తన తల్లి క్రిష్ణ భట్టాచార్యా(77) మృతదేహం పక్కన కూర్చుని ఉన్నాడు. వారం క్రితమే తన తల్లి చనిపోయిందని చెబుతున్నా మృతదేహం కుళ్లిన స్థితిని బట్టి చూస్తే ఆమె మృతిచెంది 18 రోజులు పూర్తయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మైత్రేయను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాము క్రైస్తవ మతంలోకి మారామని, తమ మత ఆచారాల ప్రకారం మృతదేహాన్ని 21 రోజుల తరువాతే ఖననం చేయాలని అందుకే వేచిచూస్తున్నానని మైత్రేయ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఎంసీఏని మధ్యలేనే మానేసిన మైత్రేయ నిరుద్యోగి కాగా, ఆయన తల్లి టీచర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. వైద్యుడిగా పనిచేసిన మైత్రేయ తండ్రి 2013లో ఒంటికి నిప్పు అంటుకుని అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. తండ్రి పింఛన్‌ డబ్బులతోనే ప్రస్తుతం తల్లికొడుకులు కుటుంబం వెళ్లదీస్తున్నారు. 

మరిన్ని వార్తలు