సిరిసిల్లలో మరో మృగాడు

8 Jul, 2019 10:23 IST|Sakshi
బాధితురాలిని ఆసుపత్రికి తీసుకువచ్చిన సీఐ శ్రీనివాస్, ఐసీడీఎస్‌ అధికారులు

వేములవాడ ఘటన మరువక ముందే..  

పిచ్చితల్లిని  గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు  

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనేలా తయారవుతున్నారు మృగాళ్లు. మొన్నటికి మొన్న వేములవాడలో బాలికను వరుసకు బావే లోబర్చుకుని గర్భవతిని చేసిన ఘటన మరువక ముందే సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చిన్నబోనాలలో నివాసం ఉండే ఓ పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు మరో ప్రబుద్ధుడు. తనకేం జరుగుతుందో తెలుసుకోలేని ఆ పిచ్చితల్లి బాత్‌రూం వెళ్లిన సందర్భంలో తనకు తానే ప్రసవం చేసుకుంది. పుట్టిన ఆడశిశువు క్షణకాలంలో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. 

సాక్షి, సిరిసిల్ల: మున్సిపల్‌ పరిధిలో నివాసం ఉండే ఇండ్ల దేవలక్ష్మి(22)  మతిస్థిమితం లేదు. తల్లి వజ్రవ్వ, తండ్రి నర్సయ్య రోజువారి కూలీలు. వీరితోపాటు అప్పుడప్పుడు పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో స్థానికంగా నివాసం ఉండే రాజు అనే మృగాడి కళ్లు దేవలక్ష్మిపై పడ్డాయి. మాయమాటలు చెప్పి పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు. నెలల గడిచే కొద్ది దేవలక్ష్మి శరీరాకృతిలో మార్పులు రావడంతో సిరిసిల్ల వెంకంపేటలోని సత్యనారాయణ అనే ఆర్‌ఎంపీ వద్ద పరీక్షలు చేయించి మందులు తీసుకున్నట్లు దేవలక్ష్మి తల్లి వివరించింది. ఆర్‌ఎంపీ దేవలక్ష్మి గర్భవతి అని చెప్పలేదని బాధితురాలి తల్లి వాపోయింది.  

గోప్యంగా నెలల గడిచాక..  
దేవలక్ష్మి ఆదివారం ఉదయం బాత్‌రూంకు వెళ్లి అందులో తనకు తెలియకుండా స్వతహాగా ప్రసవం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పుట్టిన ఆడశిశువు పరిమాణాన్ని బట్టి గర్భం దాల్చి ఏడునెలలు దాటి ఉంటుందని వైద్యులు, ఐసీడీఎస్‌ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులిద్దరికి సరైన అవగాహన లేకపోవడంతో ఘోరం జరిగిందని స్థానికులు ముచ్చటించుకున్నారు.  

ప్రబుద్ధుడి పేరు చెప్పలేని స్థితిలో... 
యువతి ప్రసవించిందని తెలిసిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పలురకాల ప్రశ్నలు అడిగారు. బాధితురాలి తల్లి ఎలాంటి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న రాజుపై పది మందిలో పంచాయతీ పెట్టాలని చెప్పామని కానీ ఆ పని చేసే స్థితి తల్లిదండ్రులిద్దరికి లేకపోవడం ప్రబుద్ధుడు ఆడింది ఆటగా మారిందనే మాటలు వినిపించాయి.  

ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. పోలీసుల చొరవతో ప్రైవేటుకు.. 
బాత్‌రూంలో యువతి ప్రసవించి ప్రాణాపాయ స్థితిలో ఉందని స్థానికులు, ఐసీడీఎస్, ఎన్‌జీవో, పోలీసు అధికారులు హుటాహుటీనా ఆసుపత్రికి వస్తే అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఎలాంటి పరీక్షలు చేయకుండా గైనకాలజిస్ట్‌ లేరని కరీంనగర్‌ వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. మృతశిశువును మార్చురీలో భద్రపరచాలని సీఐ శ్రీనివాస్‌ చెప్పినా దానిపై స్పందన లేకుండాపోయింది.

పిచ్చితల్లికి సరైన వైద్యం అందించాలని చెబుతుంటే మృతశిశువు రక్తపరీక్షలు చేయాలని, ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారని డ్యూటీ డాక్టర్‌ తన కుర్చీలోంచి లేవకుండా ఇచ్చిన సలహాలు అందరిలో కోపాన్ని కలిగించాయి. అన్ని గమనించిన సిరిసిల్ల సీఐ శ్రీనివాస్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఐసీడీఎస్‌ సీడీపీవో అలేఖ్యపటేల్, అంగన్‌వాడీ టీచర్స్‌  వింధ్యారాణి, వెంకటలక్ష్మి మరో స్థానికురాలి సహకారంతో సిరిసిల్లలో అమ్మ ఆసుపత్రి వైద్యురాలు వాణి వద్దకు దేవలక్ష్మిని పంపించి వైద్య సేవలందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నిర్లక్ష్యాన్ని అందరూ తప్పుబట్టారు.

చట్టప్రకారం చర్యలు
ప్రస్తుతం యువతిని రక్షించే చర్యలు తీసుకున్నాం. దీనికి కారణమైన వ్యక్తికి సంబంధించి సమాచారం ఉంది. దానిని చట్టపరిధిలో పరిశీలించి యువతికి న్యాయం చేసేలా ముందుకెళ్తాం.  
– శ్రీనివాస్, సీఐ, సిరిసిల్ల టౌన్‌     

మరిన్ని వార్తలు