ఎనిమిదేళ్ల బాలికపై దాడి!

10 Sep, 2019 12:24 IST|Sakshi
రాజును పట్టుకువస్తున్న గ్రామ యువకులు

అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు కన్నేశాడు.. గణేష్‌ నిమజ్జనాన్ని తిలకించడానికి రాత్రి ఇంటి నుంచి బయటికి రావడం గమనించాడు.. తానే దగ్గరుండి ఇంటికి తీసుకొస్తానని బాలిక అమ్మమ్మకు నమ్మబలికాడు.. అతని మాయమాటలు నమ్మిన ఆ వృద్ధురాలికి ఏం తెలుసు ఆ కామాందుడు లైంగిక దాడి చేసి చిన్నారిని జీవితాన్ని నాశనం చేస్తాడని.. రాత్రంతా బిడ్డ ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులందరు వెతుకగా గ్రామశివారులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.  

సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్‌) : అభం శుభం తెలియని బాలికలపై మానవ మృగాలు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. జడ్చర్లలో పదో తరగతి బాలికపై జరిగిన సంఘటన మరువకముందే.. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటలో ఎనిమిదేళ్ల బాలికపై ఆదివారం రాత్రి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ చల్లా జ్యోతి కథనం ప్రకారం.. లాల్‌కోటకు చెందిన మైనర్‌ బాలిక అమ్మమ్మతో కలిసి బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటుచేసిన వినాయక నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు వెళ్లింది. అనంతరం తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో 22 ఏళ్ల పోగుల రాజు ఇంటి వద్ద వదులుతానని నమ్మించి బాలికను బైకుపై ఎక్కించుకున్నాడు. సమీపంలోని కోయిల్‌సాగర్‌ కాల్వ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటికే అమ్మమ్మ ఇంటికి చేరుకోగా.. ఎంతకూ బాలిక రాకపోవడంతో చుట్టుపక్కల వారితో కలిసి వెతికారు. కాల్వ సమీపంలో బైకు కనిపించడంతో అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సోమవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

జల్సాలకు అలవాటుపడి..
చదువు సంధ్యలేని పోగురాజు చిన్నతనం నుంచి తన తండ్రితో పాటు మేకలను కాసేవాడు. మూడేళ్ల క్రితం ట్రాక్టర్‌ నడుపుతూ విలాసాలతో గడిపేవాడు. తాజాగా ఆదివారం రాత్రి వినాయక ఉత్సవాల సందర్భంగా మద్యం తాగి ఈ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయి పెద్దచింతకుంట శివారులోని వెంటేశ్వరెడ్డిబావి వద్ద ఉండగా సోమవారం సాయంత్రం లాల్‌కోట గ్రామస్తులు కొందరు గమనించారు. వెంటనే అతడిని   పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఈ సంఘటనపై లాల్‌కోటలో సీఐ పాండురంగారెడ్డి విచారించారు.    

బాలిక కుటుంబ నేపథ్యం  
కాగా, ఈ బాలిక తల్లికి ఆత్మకూర్‌ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే మూడేళ్ల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తన కూతురిని అమ్మమ్మ వద్ద వదిలి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. దీంతో ఈ బాలికను అమ్మమ్మనే చదివిస్తోంది.  

మరిన్ని వార్తలు