మహిళా వీఆర్‌ఏకు లైంగిక వేధింపులు

22 Oct, 2019 09:30 IST|Sakshi
వీఆర్‌ఏ అసోసియేషన్‌కు  మహిళా వీఆర్‌ఏ రాసిన లేఖ 

సాక్షి, తాడేపల్లిగూడెం/పశ్చిమ గోదావరి : తాడేపల్లిగూడెం తహసిల్దార్‌ కార్యాలయంలోని ఓ మహిళా వీఆర్‌ఏతో మండలానికి చెందిన అప్పారావుపేట వీఆర్వో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఏపీ స్టేట్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వీఆర్‌ఏ అసోసియేషన్‌ నాయకుడు జి.ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోమవారం వివరాలు వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేశారు. మహిళా వీఆర్‌ఏ పట్ల కొంత కాలంగా అప్పారావుపేట వీఆర్వో ఆర్వీ పోతురాజు అసభ్యంగా ప్రవరిస్తున్నాడని, బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. తహసిల్దార్‌ ఆదేశానుసారం ఆదివారం పనిచేసేందుకు వచ్చిన ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ వీఆర్వో చేయి పట్టుకున్నాడని ఆరోపించారు. వేధింపులపై సదరు మహిళా వీఆర్‌ఏ తమ యూనియన్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అప్పారావుపేట వీఆర్వోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. లేదంటే ఈ సంఘటనను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళతామని వెల్లడించారు. దీనిపై తహసిల్దార్‌ ప్రసాద్‌ వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు.

మరిన్ని వార్తలు