రాడ్లతో కొట్టి వ్యక్తి హత్య

4 Jan, 2019 09:55 IST|Sakshi
మహిమ వర్ధన్‌ (ఫైల్‌) 

నిజాంపట్నం(రేపల్లె)/సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నిజాంపట్నంలో కిరాతకులు రెచ్చిపోయారు. ఒక వ్యక్తిని రాడ్లతో కొట్టి చంపారు. స్థానికుల కథనం ప్రకారం నిజాంపట్నం ఎక్స్‌ మిలటరీ కాలనీకి చెందిన శీలం మహిమ వర్ధన్‌ (46) గురువారం ఉదయం 8 గంటల సమీపంలో టీ తాగేందుకు బస్టాండ్‌ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంకీక్యాప్‌లు పెట్టుకుని వచ్చి మహిమవర్ధన్‌ కంట్లో కారం చల్లి రాడ్లతో తలపై కొట్టి హతమార్చారు. ఈ విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చిన మహిమ వర్ధన్‌ భార్య రత్నావళి, బంధువులు బాధ్యులపై చర్యలు తీసుకునేవరకూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసువెళ్లనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు.

అయితే ఈ హత్యకు భూ వివాదాలే కారణమని చెబుతున్నారు. 1973లో అప్పటి ప్రభుత్వం 124 మంది దళితులకు 186 ఎకరాలు పంపిణీ చేసింది. ఆ భూమిని ప్రస్తుతం పలువురు రైతులు సాగుచేస్తున్నారు. తమ భూమిని పెత్తందారులు లాక్కుని అనుభవిస్తున్నారని గతంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేశారు. ఈ వివాదాల నేపథ్యమే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలిసి వైఎస్సార్‌ సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, బంధువులను పరామర్శించారు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు మృతుడి భార్య, బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మృతుడి కుటుంబానికి తన వంతు సాయంగా రూ. 5 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్‌ ఎస్పీ వరదరాజులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదుచేశారు.  కాగా, మహిమవర్ధన్‌ హత్యకు టీడీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హత్యలో పాల్గొన్న వ్యక్తి టీడీపీ నేత బొమ్మిడి రామకృష్ణ ముఖ్య అనుచరుడని స్థానికులు చర్చించుకుంటున్నారు. హత్యలో టీడీపీ నేతల హస్తం ఉండటంతో వారిని తప్పించి వైఎస్సార్‌సీపీ నేతలపై మోపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు