కారం చల్లి.. గొంతుకోసి వ్యక్తి హత్య

20 Nov, 2019 09:44 IST|Sakshi
ఘటనా స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి  మృతదేహం, డాగ్‌స్క్వాడ్‌

ఏడుపాయల్లో మరో దారుణం

ముక్కలు చేసి.. మూటగట్టిన హత్య మిస్టరీ వీడకముందే 

డాగ్‌స్క్వాడ్‌తో పోలీసుల వేట

త్వరలో పట్టుకుంటాం: మెదక్‌ డీఎస్పీ  

సాక్షి, మెదక్‌: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళను ముక్కలుగా నరికి మూటగట్టి పడేసిన మిస్టరీ వీడకముందే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. సుమారు 45యేళ్ల వయస్సు గల ఓ వ్యక్తిని కళ్లలో కారం చల్లి.. కత్తితో గొంతుకోసి.. బండరాయితో తలపై బాది అత్యంత కిరాతకంగా హత్యచేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో వరుస హత్యలు చోటు చేసుకుంటుండటంతో భక్తులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. పోలీసు వర్గాలు.. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల మేరకు పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం ఏడుపాయల్లోని హరితహోటల్‌ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసు బలగాలు, డాగ్‌స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్స్‌ నిపుణులతో  సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. తెలిసిన వారే మృతుడిని నమ్మించి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. శవ పరిశీలన బట్టి ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

విందుకు వచ్చి.. బలై ఉంటాడు.. 
తెలిసిన వ్యక్తులే మృతుడిని ఏడుపాయల్లో విందుకోసం తీసుకొచ్చి మద్యం తాగించి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా మృతుడి కళ్లలో కారం చల్లి.. గొంతుకోసి ఉంటారని.. అనుకుంటున్నారు. ఆపై మృతుడి తలపై బండరాయితో బాది హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నల్లని ద్రవాన్ని ముఖంపై పోసి గుర్తు పట్టకుండా చేసేందుకు యత్నించినట్లు తెలుస్తుంది. అనంతరం శవాన్ని కాల్చివేసేందుకు మూడు ఆటో టైర్లను సైతం తీసుకొచ్చారు. కాని టైర్లను అలాగే వదిలేశారు. అయితే మద్యం సేవించేందుకు తెచ్చిన స్టీలు జగ్గు స్థానిక టెంట్‌హౌజ్‌లో నుంచి తీసుకొచ్చారని తెలుస్తుంది.  శవంపక్కనే రెండు ఖాళీ మద్యం బాటిళ్లు, ఒక జగ్గు, మూడు టైర్లు, మృతుడి వద్ద రక్తంతో తడిసిన రూ.500ల నగదు దొరికింది. మృతుడు నల్లప్యాంటు, తెల్లషర్టు, లేత నీలిరంగు డ్రాయర్‌ ధరించి ఉన్నాడు. చేతికి రెండు వరుసల బ్యాండ్, రెండు వరుసల మొలతాడు ఉంది. తమకు దొరికిన ఆధారాలను బట్టి హంతకులను పట్టుకుంటామని మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ ఆంజనేయులు  పేర్కొన్నారు.

మృతుడి శరీరంపై ఉన్న దుస్తులు ఆధారాలను బట్టి ఎవరికైన అనుమానం ఉంటే పాపన్నపేట పోలీసులను సంప్రదించాలని, లేదా 9440627014 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.   అక్టోబర్‌ 26న ఓ గుర్తు తెలియని మహిళను ముక్కలు ముక్కలుగా నరికి మూటగట్టి ఏడుపాయల్లో పడేశారు. ఇప్పటి వరకు ఆ మృతురాలి మిస్టరీ వీడనే లేదు.. 20యేళ్లలో సుమారు 15హత్యలు ఇక్కడ జరిగాయి. ఏడుపాయలకు కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయక పోవడంతో నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. హంతకులు సైతం వెంటనే దొరకడం లేదు. ఏడుపాయల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. అలాగే ఏడుపాయల్లో పోలీసుల ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా