మాట వినలేదని స్నేహితుడ్ని కడతేర్చాడు

5 Oct, 2019 09:51 IST|Sakshi
చరణ్‌ మృతదేహం

నిందితుడి కోసం పోలీసుల గాలింపు

కేసు నమోదు చేసి దర్యాప్తు

సాక్షి, గూడూరు: వారిద్దరూ స్నేహితులు. బతుకు జీవనం కోసం ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరారు. వారిలో ఒకరి ప్రవర్తన యజమానికి నచ్చకపోవడంతో అతడిని కొద్దిరోజుల క్రితం పనిలోంచి తొలగించాడు. దీంతో అతను తన స్నేహితడ్ని కూడా పనికి వెళ్లకుండా తనతోపాటు రావాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు నిరాకరించడంతో అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో గొంతు కోసి విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బొగ్గుల దిబ్బ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం తెనాలిలోని బాలాజీరావుపేటకు చెందిన బాలా రజని, బాలకృష్ణల కుమారుడు చరణ్‌ (24) అక్కడే చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఎనిమిది నెలల క్రితం చరణ్‌తో స్థానికంగా ఉండే స్నేహితుడు వెంకటవేణు గూడూరులో సమోసాలు తయారుచేసే శేఖర్‌ అనే అతని వద్ద పని ఉందని చెప్పి తీసుకువచ్చాడు. ఇద్దరూ బొగ్గులదిబ్బ ప్రాంతంలో పని చేసుకుని రాణీపేటలో ఉండేవారు. వెంకట వేణు ప్రవర్తన బాగోలేకపోవడంతో కొద్దిరోజలు క్రితం యజమాని శేఖర్‌ అతడిని పనిలోంచి తొలగించాడు. దీంతో వేణు మరోచోట పనిచేస్తూ తన స్నేహితుడు చరణ్‌ను కూడా వచ్చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు.

కత్తితో గొంతుకోసి...
ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి బొగ్గులదిబ్బ ప్రాంతంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. మాటామాట పెరిగింది. ఒకరిపై ఒకరు కలబడగా పక్కనే ఉన్న వారు వారిని వేరుచేశారు. అంతటితో ఆగని వెంకటవేణు తన వెంట తెచ్చుకున్న కత్తితో చరణ్‌పై దాడి చేసి గొంతు కోశాడు. తర్వాత విచక్షణారహితంగా శరీరంపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్తించి తీవ్రంగా గాయపడిన చరణ్‌ను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చరణ్‌ మృతిచెందినట్లుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ దశరథరామారావు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం నెల్లూరులోని మృతదేహాన్ని పరిశీలించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి బాలకృష్ణ గతంలోనే మృతిచెందగా అతని తల్లి రజని పని కోసం కోల్‌కత్తాకు వెళ్లినట్లు తెలిపారు. శనివారం పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు. హత్యకు పాల్పడిన వేణు కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు