మేనమామే కాలయముడు!

17 Jun, 2018 01:39 IST|Sakshi
సృజనరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నిందితుడు మల్లికార్జునరెడ్డి

మానసిక వికలాంగులైన చిన్నారుల దారుణ హత్య

ఈత కొలనుకు తీసుకువెళ్తానని మిర్యాలగూడ నుంచి నగరానికి తీసుకొచ్చి దారుణం

మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కిన మల్లికార్జునరెడ్డి

అక్క ఇబ్బందులు చూడలేకే హత్య చేసినట్టు వెల్లడి

హైదరాబాద్‌/మిర్యాలగూడ: అభంశుభం తెలియదు. పన్నెండేళ్లు వచ్చినా మానసిక ఎదుగుదలే లేదు. ఇప్పటికీ తల్లిదండ్రులే వారి ఆలనాపాలనా చూసుకోవాలి. పుట్టుకతోనే ఆ కవలలను దేవుడు చిన్నచూపు చూస్తే.. ఇప్పుడు మేనమామే కాలయముడై వారి ప్రాణాలు హరించాడు. మానసిక వైకల్యంతో పుట్టిన కవల పిల్లల వల్ల అక్కాబావ జీవితాల్లో ఆనందం లేకుండా పోయిందని ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 

పుట్టుకతోనే మానసిక వైకల్యం.. 
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురం గ్రామానికి చెందిన అప్పిరెడ్డి, సరోజినిలకు లక్ష్మి, మల్లికార్జునరెడ్డి సంతానం. 14 ఏళ్ల క్రితం లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఆమె మేనమామ కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డితో పెళ్లి చేశారు. నల్లగొండ జిల్లా పెద్దదేవులపల్లి లోని రెడ్డీస్‌ ల్యాబ్‌లో శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నా రు. మిర్యాలగూడ రెడ్డికాలనీలోని ఒక అపార్టుమెంట్‌లో సొంత ఫ్లాట్‌ కొనుగోలు చేసి నివాసముంటున్నారు. పెళ్లైన ఏడాదికి వీరికి కవల పిల్లలు సృజన, విష్ణువర్ధన్‌ జన్మించారు. అయితే పుట్టుకతోనే వీరికి మానసిక వైకల్యం ఉండటం తో మాటలు కూడా రాలేదు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డి, లక్ష్మిలకు రోహన్‌ జన్మించాడు. 

సోదరి ఇబ్బందులు పడుతోందని.. 
ఎనిమిదేళ్ల వరకు తల్లి లక్ష్మి చెంతనే ఉన్న సృజన, విష్ణును నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఠాకూర్‌ హరిప్రసాద్‌ మానసిక వికలాంగుల సదనంలో చేర్పించారు. లక్ష్మి సోదరుడు మల్లికార్జునరెడ్డి(33) చైతన్యపురిలోని సత్యనారాయణపురంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంజనీరింగ్‌ చేసిన అతడు కొన్ని రోజులపాటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతడు తరచూ సదనంలో ఉన్న పిల్లల వద్దకు వెళ్లి వస్తుండేవాడు. వేసవి సెలవులు కావడంతో సృజన, విష్ణువర్థన్‌ను మిర్యాలగూడ తీసుకెళ్లాడు. అయితే మానసిక వికలాంగులైన పిల్లల సంరక్షణతో అక్క ఇబ్బందులు పడుతూ ఆనారోగ్యం పాలవడం మల్లిఖార్జునరెడ్డిని కలచివేసింది. తన అక్కాబావ సంతోషంగా ఉండాలంటే ఆ పిల్లలిద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఈత కొలనుకని తీసుకెళ్లి.. 
నాలుగు రోజుల క్రితం మిర్యాలగూడ వెళ్లిన మల్లిఖార్జునరెడ్డి సృజన, విష్ణులను ఈతకొలనుకు తీసుకెళుతున్నానని అక్క లక్ష్మికి చెప్పి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకొచ్చాడు. అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు చైతన్యపురిలోని తన ఇంటికి వారిని తీసుకొచ్చాడు. అక్క ఫోన్‌ చేస్తే పిల్లలను ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పాడు. అయితే శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పిల్లలను గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. అనంతరం నాగోల్‌లో ఉండే తన స్నేహితుడు సత్యపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసి పిల్లలను మిర్యాలగూడలో వదిలేయాలని కారు పంపాలని కోరాడు. సత్యపాల్‌ తన బావమరిది వివేక్‌రెడ్డికి కారు(టీఎస్‌08ఈకే 3410) ఇచ్చి రాత్రి 10.30 గంటల సమయంలో మల్లిఖార్జునరెడ్డి ఇంటికి పంపాడు. 

పోలీసులకు సమాచారమిచ్చిన ఇంటి యజమాని 
సృజన, విష్ణులను మల్లికార్జునరెడ్డి, వివేక్‌రెడ్డి కలసి కారులోకి తరలిస్తుండగా చూసిన ఇంటి యజమాని మహేశ్వర్‌రెడ్డి బయటకు వచ్చి ఏమైందని అడిగాడు. కూల్‌డ్రింక్‌ అనుకుని పిల్లలు హార్పిక్‌ లిక్విడ్‌ను తాగారని, ఆస్పత్రికి తరలిస్తున్నామని తటపటాయిస్తూ మల్లిఖార్జునరెడ్డి బదులిచ్చాడు. అయితే కారు డిక్కీలో చిన్నారిని పడుకోబెట్టడంతో అనుమానం వచ్చిన మహేశ్వర్‌రెడ్డి పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు సమాచారమిచ్చాడు. ఈలోగా స్థానికులు అక్కడికి చేరుకుని కారును అడ్డగించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జునరెడ్డి, అతడికి సహకరించిన వివేక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలోని చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చి మృతదేహాలను శనివారం పోస్ట్‌మార్టం చేయించారు. అయితే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తమకు కేసు వద్దని పోలీసులకు చెప్పటం గమనార్హం. 

నాలుగేళ్లుగా హతమార్చేందుకు యత్నం.. 
మానసిక వైకల్యంతో జన్మించిన కవల పిల్లల వల్ల అక్కా, బావ ఇబ్బందులు పడుతున్నారని, వారిని చూసి తమ తల్లిదండ్రులు నిత్యం వేదనతో కుమిలి పోతున్నారని, అందుకే పిల్లలను హతమార్చాలని నిర్ణయించుకున్నట్టు మల్లిఖార్జునరెడ్డి పోలీసులకు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఆడపిల్ల పెరిగి పెద్దదైతే మరిన్ని కష్టాలు వస్తాయని భావించిన మల్లిఖార్జునరెడ్డి.. ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నానని, నాలుగేళ్లుగా తన నిర్ణయాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి పిల్లలను హత్య చేసిన తర్వాత అక్క లక్ష్మికి ఫోన్‌ చేసి మిర్యాలగూడకు తీసుకొస్తున్నానని చెప్పినట్లు సమాచారం. అక్క, పిల్లలపై మల్లిఖార్జనరెడ్డికి ఎంతో ప్రేమ ఉందని, ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదని వారి బంధువులు వాపోయారు. 

ఎవరి పాత్ర ఉన్నా వదలం: ఏసీపీ 
మల్లిఖార్జునరెడ్డి చిన్నారులను హత్య చేయటంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తామని ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీందర్‌రావు తెలిపారు. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా పూర్తి విచారణ చేస్తామని, కుటుంబ సభ్యులలో ఎవరి పాత్ర ఉన్నా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మల్లిఖార్జునరెడ్డి, వివేక్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని, ఘటనాస్థలిలోని సీసీ ఫుటేజీ కేసు విచారణకు కీలకమని చెప్పారు. అయితే మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను ఈతకొలనుకు తీసుకెళ్తానంటే తల్లిదండ్రులు ఎలా అంగీకరించారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తమకు కేసు వద్దని పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు చెప్పటం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు