మేడ్చల్‌లో అమానుషం!

3 Jul, 2020 03:26 IST|Sakshi

తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో ఫ్రెండ్‌ కుమార్తెపై దాడి

ఇంటికి వచ్చి ఆమెతో వాగ్వాదం.. ఆపై చిన్నారి గొంతు కోసి హత్య

అడ్డుకున్న మరో స్నేహితుడిపై దాడి చేసి మెడ కోసుకున్న యువకుడు

ఘట్‌కేసర్‌లో ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు

సాక్షి, ఘట్‌కేసర్‌: ఓ తల్లి వేసిన తప్పటడుగులు, ఓ యువకుడి ఆవేశం కలిసి అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకున్నాయి. తొలుత స్నేహంగా ఉండి తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో ఆమె ఐదేళ్ల కుమార్తెను అతడు దారుణంగా హత్య చేశాడు. ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌లో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా అత్మకూర్‌ మండలంలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న సూరనేని కళ్యాణ్‌రావుకు ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష 2011లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది.

ఇది కాస్తా ప్రేమకు దారి తీసి ఇరువురూ వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఆద్య జన్మించింది. తమ కుమార్తె చదువు కోసమని ఇస్మాయల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌కు నివాసం మార్చారు. ఈ క్రమంలో ఏడాది క్రితం బజాజ్‌ ఫైనాన్స్‌లో సెల్‌ఫోన్‌ తీసుకునేందుకు వెళ్లిన అనూషకు అక్కడ పనిచేసే సిరిసిల్ల జిల్లా ముక్తాబాద్‌కు చెందిన కరుణాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అప్పుడప్పుడూ తనతోపాటు స్నేహితుడు రాజశేఖర్‌ని కూడా తీసుకొచ్చేవాడు. 

సర్జికల్‌ బ్లేడ్‌తో గొంతు కోసి...
ఇటీవల అనూష తనతో కంటే రాజశేఖర్‌తోనే ఎక్కువ చనువుగా ఉంటుందని కరుణాకర్‌ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కళ్యాణ్‌రావు బుధవారం విధి నిర్వహణ నిమిత్తం ఆత్మకూరు వెళ్లగా.. గురువారం రాజశేఖర్‌.. వాళ్లింటికి వచ్చాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కరుణాకర్‌.. రాజశేఖర్‌ని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో అతడు బాత్‌రూంలో దాక్కోగా.. అనూష, కరుణాకర్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం కోపం పట్టలేని కరుణాకర్‌.. తన వెంట తెచ్చుకున్న సర్జికల్‌ బ్లేడుతో చిన్నారి ఆద్య గొంతు కోశాడు. ఇది చూసి అనూష గట్టిగా కేకలు వేయడంతో బయటకు వచ్చిన రాజశేఖర్‌పై కూడా దాడి చేశాడు. తర్వాత తన మెడతోపాటు మణికట్టుపై కోసుకున్నాడు.

తొలుత ఈ పరిణామాలకు షాక్‌కు గురైన అనూష వెంటనే తేరుకుని స్థానికుల సహాయంతో ఆద్యను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే ఆ చిన్నారి మరణించిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో ఆమె షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనూష భర్త కళ్యాణ్‌రావు ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో తనను అనూష దూరం పెడుతోందని, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు కరుణాకర్‌ పోలీసు విచారణలో చెప్పినట్టు తెలిసింది. కళ్యాణ్‌రావు, రాజశేఖర్‌ వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న అనూష చెప్పేవిషయాలను బట్టి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు