ప్రాణం తీసిన పాతకక్షలు

18 Jan, 2019 07:32 IST|Sakshi
పేర్ల ధనరాజు మృతదేహం

కుటుంబ తగాదాలపై తరచూ ఘర్షణలు

అదను చూసి మట్టుబెట్టిన బంధువు

గంగవరం గ్రామంలో దారుణం

విశాఖపట్నం, గాజువాక: గంగవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో దగ్గరి బంధువే ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఉదంతంతో గాజువాక ప్రాంతం ఉలిక్కి పడింది. అత్యంత కిరాతకంగా చేసిన ఈ హత్యకు సంబంధించి న్యూ పోర్టు పోలీసులు, గంగవరం గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన పేర్ల ధనరాజు (29), చోడిపిల్లి నరేష్‌ దగ్గరి  బంధువులు. ఇద్దరూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న పోలారావు అనే వ్యక్తి ధనరాజుకు మేనమామ. అతడు నరేష్‌ సోదరికి భర్త. వేరే మహిళతో పోలారావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయంపై వారి మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో ధనరాజు కూడా తన మేనమామకు మద్దతుగా వెళ్లి నరేష్‌తో గొడవపడ్డ సందర్భాలున్నాయి. దీంతో వారి మధ్య కక్షలు చోటుచేసుకున్నాయి.

మాటువేసి కిరాతకంగా హత్య
పెదగంట్యాడలో బుధవారం జరిగిన ఒక పరసకు వెళ్లిన పోలారావు, ధనరాజు, నరేష్‌ కలిసి మద్యం సేవించారు. రాత్రి పది గంటల సమయంలో గంగవరం గ్రామానికి చేరుకున్న తరువాత పాతగొడవలు, వివాహేతర సంబంధాలపై గాంధీ జంక్షన్‌ వద్ద మళ్లీ గొడవ మొదలైంది. ఈ గొడవ సాగుతుండగానే పోలారావు అక్కడికి సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో నరేష్‌ కూడా వెళ్లిపోతున్నట్టుగా నమ్మించి...  ధనరాజు ఇంటికి వెళ్లే మార్గంలోని ఒక గ్రౌండ్‌ వద్ద తన స్నేహితులతో కలిసి మాటు వేశాడు. కొద్ది సేపటి తరువాత తన ఇంటికి వెళ్తున్న ధనరాజుపై తన స్నేహితులతో కలిసి నరేష్‌ దాడికి పూనుకున్నాడు.

ఈ సంఘటనలో బీరు బాటిల్‌తో ధనరాజు తలపై గట్టిగా మోదడంతోపాటు అదే బీరు బాటిల్‌తో అతడి గొంతుకోసి హత్య చేశాడు. ధనరాజు మృతి చెందాడని నిర్థారించుకున్న తరువాత అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. అర్ధరాత్రి కావస్తున్నా తన కుమారుడు ఇంటికి చేరకపోవడంతో అతడి తల్లి సింహాచలం గాంధీ జంక్షన్‌కు సమీపంలో ఉంటున్న పోలారావు ఇంటికి వెళ్లింది. తాను చాలాసేపటి క్రితమే ఇంటికి వచ్చేశానని చెప్పడంతో గ్రామంలో వెతకడం ప్రారంభించారు. దీంతో గ్రౌండ్‌ వద్ద రక్తపు మడుగులో ధనరాజు శవమై కనిపించాడు. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని 108 అంబులెన్స్‌కు, న్యూపోర్టు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది ధనరాజు మృతి చెందినట్టు నిర్థారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు న్యూపోర్టు సీఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు