యువతి గర్భానికి వెల

6 Jun, 2018 08:44 IST|Sakshi
పరారీలో ఉన్న ముకుందన్‌

తిరువళ్లూరు: గర్భం దాల్చిన యువతిని అబార్షన్‌ చేయించుకోవాలనీ ఇందుకు పరిహారంగా రూ.రెండు లక్షలు ఇవ్వజూపిన నిందితుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవాలని న్యాయమూర్తి సుభాషిణి ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గ్రామానికి చెందిన యువతి (23). కళంబాక్కం గ్రామానికి చెందిన కోదండన్‌ కుమారుడు ముకుందన్‌ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. కోదండన్‌ ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

ప్రస్తుతం యువతి ఐదు నెలల గర్బవతి. గర్భం దాల్చిన విషయాన్ని యువకుడి వద్ద ప్రస్తావించిన యువతి పెళ్లి చేసుకోవాలని మూడు నెలలుగా కోరుతూనే ఉంది. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు ఎస్పీ శిబిచక్రవర్తినీ కలిసి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న యువకుడి తల్లి కళ, తండ్రి కోదండన్‌ యువతికి ఫోన్‌ చేసి అబార్షన్‌ చేయించుకోవాలని, ఇందు కోసం రెండు లక్షల రూపాయలను ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఫోన్‌లో రికార్డ్‌ చేసిన యువతి ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ యువకుడితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకుడి తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు