న్యాయం కోసం పోరాటం

28 Jul, 2018 14:54 IST|Sakshi
ఆమరణ దీక్ష చేస్తన్న హనుమయ్య  

జగిత్యాలజోన్‌ : కుటుంబపోషణకు సౌదీ వెళ్లి డబ్బు పంపిస్తే.. ఇంటివద్ద ఉన్న తన భార్య విచ్చలవిడిగా ఖర్చు చేసి.. తీరా తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోందని.. పలుమార్లు నిలదీసినా.. దబాయిస్తోందని ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగాడు.

తనకు న్యాయం చేయాలని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయిత్‌పల్లి గ్రామానికి చెందిన సంటి హనుమయ్యకు పదేళ్లక్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది.

అనంతరం ఉపాధి నిమిత్తం సౌదీ దేశానికి వెళ్లాడు. అక్కడ ఐదు సంవత్సరాలు కష్టపడి ఇంటి దగ్గర ఉన్న భార్యకు రూ. 14 లక్షల వరకు పంపించాడు. ఆ డబ్బులను సదరు మహిళ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసింది. విదేశాల నుంచి వచ్చిన హనుమయ్య డబ్బుల విషయమై నిలదీయగా ‘నా ఇష్టం.. నీకు లెక్క చెప్పను.. ఏం చేసుకుంటావో.. చేసుకో..పో’ అని దబాయించిందని బాధితుడు వాపోయాడు.

దీంతో దంపతుల మధ్య గొడవ ముదిరింది. ఈ క్రమంలో తన భార్య వేరొక వ్యక్తి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు హనుమయ్య గ్రహించాడు. ఈ విషయమై ఇద్దరినీ నిలదీశాడు. మార్పు రాకపోవడంతో పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులు ఈ ఏడాది మే 23న కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. ఇటీవలే బెయిల్‌పై అతను బయటకు వచ్చాడు. దీందో హనుమయ్య భార్య ఆ వ్యక్తితో వెళ్లిపోయింది.

కొందరు వ్యక్తుల కారణంగానే తన కాపురం కూలిపోయిందని, డబ్బు ఖర్చు అయ్యిందని సదరు వ్యక్తులపై చర్య తీసుకోవాలని గ్రామ పెద్దలను, పలువురు అధికారులను వేడుకున్నాడు. ఫలితం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ఓ ఫ్లెక్సీని ఏర్పాటుచేసి, అమరణ దీక్షకు దిగాడు. పోలీసులు అక్కడకు చేరుకుని హనుమయ్యను స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు