దారుణం: గర్భవతిపై పిడిగుద్దులతో దాడి..

22 Nov, 2019 15:13 IST|Sakshi

సిడ్నీ :  గర్భవతి అని కూడా చూడకుండా ఓ వ్యక్తి మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన ఆమెను కొట్టి.. కిందపడేసి తన్నాడు. సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును కలిచి వేస్తున్నాయి. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని ఓ కేఫ్‌లో ముగ్గురు మహిళలు ముఖానికి స్కార్ప్‌ ధరించి కూర్చుని ఉండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఒక్కసారిగా అందులోని ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. 38 వారాల గర్భవతిగా ఉన్న ఆమెపై ఆవేశంతో చేతితో పిడిగుద్దులు కురిపించి, ఆపై కాలితో తన్ని కింద పడేశాడు. ఘటనాస్థలిలో ఉన్న వారు దుండగుడిని ఆపినప్పటికీ.. అతడు రెచ్చిపోయాడు. ఈ దాడిలో సదరు మహిళ కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మహిళను శారీరకంగా హింసించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అంతేగాక ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు నిందితుడికి కనీసం బెయిల్‌ కూడా మంజూరు చేయలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్స్ (ఏఎఫ్‌ఐసీ) దీనిపై స్పందిస్తూ... ఈ ఘటనకు ముందు బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఇస్లామిక్‌ మతానికి వ్యతిరేకంగా ప్రసంగించిందని, అందుకే ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు ఇలా ప్రవర్తించాడని తెలిపారు. ఇది జాత్యంహకారంతో చేసిన చర్య అని, సమాజంలో  ఇలాంటి దాడులను ఆపకపోతే ఇలాంటివారు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాగా ఆస్ట్రేలియాలో ఓ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల ప్రకారం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్న ప్రతి 113 మందిలో 96 మంది ముఖానికి స్కార్ఫ్‌ ధరించి ఉన్నవారేనని వేధించింది. 

చదవండి : డ్యాన్స్‌ టీచర్‌ వల్ల మైనర్‌ బాలుడికి హెచ్‌ఐవీ

మరిన్ని వార్తలు