945 గ్రాముల బంగారంతో ఉడాయించిన వ్యక్తి 

24 Apr, 2018 10:34 IST|Sakshi

జంగారెడ్డిగూడెం : బంగారు ఆభరణాలు తయారుచేసే ఒక వ్యక్తి బంగారు షాపు యజమానుల నుంచి బంగారం తీసుకుని ఉడాయించిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. 945 గ్రాముల బంగారం  (సుమారు 118 కాసులు)తో అతను పరారయ్యాడు. ఎస్సై జీజే విష్ణువర్థన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక మునసబుగారి వీధిలో బంగారు నగలు తయారు చేసే ముషరాఫ్‌ ముల్లా అనే వ్యక్తి అదే వీధిలోను, పట్టణంలో పలు బంగారు షాపుల యజమానుల నుంచి వస్తువులు తయారు చేసేందుకు బంగారం తీసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన అతను ఇక్కడకు వచ్చి కొన్నాళ్లుగా వస్తువులు తయారు చేస్తున్నాడు.

సోమేశ్వర జ్యూయలర్స్‌ యజమాని కొనకళ్ల సురేష్‌బాబు బంగారు వస్తువులు తయారు చేయమని 203 గ్రాముల బంగారం ముషరాఫ్‌కు ఇచ్చినట్టు తెలిపారు. కొనకళ్ల ఉదయ్‌కుమార్‌ అనే బంగారు షాపు యజమాని 200 గ్రాములు, ఎస్‌కే జాని 103 గ్రాములు, తిరివీధి హనుమంతరావు 326 గ్రాములు, కె.మోహన్‌ 90 గ్రాములు, రమేష్‌ 23 గ్రాములు, మొత్తం 945 గ్రాముల బంగారం ముషరాఫ్‌కు ఇచ్చారు.

అయితే అతడు ఆ బంగారాన్ని తీసుకుని ఈనెల 21వ తేదీ రాత్రి ఉడాయించాడు. 22, 23 తేదీల్లో అతడి కోసం గాలించిన యజమానులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. కాగా 2016లో కూడా ముషరాఫ్‌ ఇలాగే బంగారం తీసుకుని ఉడాయించగా, అప్పట్లో పోలీసులు పశ్చిమ బెంగాల్‌ వెళ్లి అతడిని అరెస్ట్‌ చేసి బంగారం రికవరీ చేశారు. అయితే ఇటీవల ముషరాఫ్‌ పట్టణానికి వచ్చి బంగారు షాపుల యజమానులను బతిమలాడి తాను పనిచేసుకుంటానని నమ్మించి మళ్లీ బంగారంతో ఉడాయించాడు.

మరిన్ని వార్తలు