బిల్లు చూసి షాక్‌.. ఆపై ఆత్మహత్య..

11 May, 2018 17:46 IST|Sakshi

సాక్షి, ముంబై : కరెంట్‌ బిల్లు ఓ వ్యాపారి ప్రాణాన్ని బలితీసుకుంది. రూ. 8లక్షల బిల్లు చూసిన ఆ చిరువ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఔరంగాబాద్‌లోని భరత్‌ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. జగన్నాథ్‌ సెల్కే(40) కూరగాయాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ వ్యాపారి గత 20 సంవత్సరాలుగా రెండు గదుల షెడ్‌ తీసుకుని ఫ్యామిలీతో జీవనం సాగిస్తున్నాడు. 

ఏప్రిల్‌ నెలలో ఈ కుటుంబం 55,519 యూనిట్ల విద్యుత్‌ వినియోగించారని రూ. 8,64,781 బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన అతను తీవ్ర మనస్తాపనకు గురయ్యాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాక కరెంట్‌ బిల్లు అధికంగా రావడం వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో రాశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఈడీసీఎల్‌)  స్పందించింది. దీనికి ఓ సెక్షన్‌ ఇంజినీర్‌ నిర్లక్ష్యం కారణమని ఎంఎస్‌ఈడీసీఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అతను మీటర్‌ రీడింగ్‌ను 6, 117.8 కేడబ్యూహెచ్‌ కాగా 61, 178 కేడబ్యూహెచ్‌గా కొట్టాడని తెలిపింది. అందుచేతనే రూ. 8, 64,781 బిల్లు వచ్చిందని ఓ ప్రకటనలో ఎంఎస్‌ఈడీసీఎల్ పేర్కొంది. ఈ ఘటనపై ఓ బిల్లింగ్‌ క్లర్కును సస్సెండ్‌ చేసినట్లు సమాచారం. జగన్నాథ్‌ ఇంట్లో మీటర్‌ పనిచేయనందుకు జనవరి 10న దాని స్థానంలో కొత్తమీటరు అమర్చినట్లు అధికారులు తెలిపారు.   ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు