బతికుండగానే చనపోయాడంటూ ప్రచారం

25 Jul, 2019 11:29 IST|Sakshi

ముంబై: ఇంటర్నెట్‌ వాడకం పెరిగాక.. యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలు నకిలీ వార్తల ప్రచారానికి కేంద్రాలుగా మారుతున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో అయితే ప్రతి రోజు ఏదో ఒక సెలబ్రిటీ కుటుంబానికి చెందిన చావు వార్తలు రావడం సాధరణం అయిపోయింది. ఒక్కోసారి ఏకంగా సెలబ్రిటీల గురించే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం.. ఆనక వారు మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించడం నిత్యం చూస్తూనే ఉన్నాం.

ఈ మధ్యకాలంలో వాట్సాప్‌ కూడా ఇలాంటి ఫేక్‌ వార్తల ప్రచారనికి అడ్డాగా మారింది. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్‌ షాక్‌ ఇచ్చింది. బతికుండగానే తన మృతికి సంతాపం తెలుపుతూ.. 400 సందేశాలు వచ్చేసరికి షాకవ్వడం అతడి వంతయ్యింది. వివరాలు.. మూడు రోజుల క్రితం మీడియా ప్రొఫెషనల్‌ రవీంద్ర దుసాంగే అనే వ్యక్తి చనిపోయాడంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశారు. దాంతో పాటు అతని ఫోటోను కూడా మెసేజ్‌ చేశారు. ఇంకేముంది దుసాంగే ఫోన్‌కు సంతాప సందేశాలు వరుస కడుతున్నాయి. తొలుత దీన్ని అంతగా పట్టించుకోని దుసాంగే.. మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించాడు.

ఈ విషయం గురించి దుసాంగే మాట్లాడుతూ.. ‘తొలుత ఈ మెసేజ్‌లను అంతగా పట్టించుకోలేదు. తర్వాత నా స్నేహితులకు, బంధువులకు కూడా ఈ మెసేజ్‌లు రావడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం మా అమ్మకు తెలిసి తను చాలా బాధపడింది. మెసేజ్‌తో పాటు నా ఫోటోను కూడా షేర్‌ చేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను’ అని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు