ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

5 Apr, 2020 17:11 IST|Sakshi

లక్నో : దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి తబ్లిగి-జమాత్‌ సమావేశమే ప్రధాన కారణమని ఆరోపించిన యువకుడిని కాల్చి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక టీషాప్‌ వద్దకు ఒక వ్యక్తి వచ్చి కరోనా కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం తబ్లిగి జమాత్‌ సమావేశమేనని చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి జోక్యం చేసుకొని అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయద్దొని పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో నిందితుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆ వ్యక్తిని కాల్చాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా పక్కన ఉన్నవారు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా మృతి చెందిన బాధితుని కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. (కరోనా : ఆరు నిమిషాల వ్యవధిలోనే)

మరోవైపు ఈ ఘటన ఆదివారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదని, అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకోవద్దని, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలంటూ ప్రయాగ్‌రాజ్‌ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.  కాగా ఇప్పటివరకు యూపీలో 227 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు ఒక్కవారంలోనే అమాంతంగా పెరిగిపోవడంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి-జమాత్‌ సమావేశం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదపు అన్ని రాష్ట్రాల నుంచే గాక విదేశాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. దేశంలోని దాదాపు 17 రాష్ట్రాల్లో మర్కజ్‌ సమావేశం కరోనా కేసులు రెట్టింపయ్యేలా చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3వేలకు పైగా కరోనా కేసులు దాటగా, మృతుల సంఖ్య 79కి చేరుకుంది

మరిన్ని వార్తలు