'వైట్ హౌస్‌'పై కాల్పులు జరిపి.. ఆపై!

4 Mar, 2018 16:19 IST|Sakshi

వాషింగ్టన్: ఓ గుర్తుతెలియని వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' భద్రతా సిబ్బందికి, ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన ఆ దుండగుడు తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

వైట్ హౌస్ సిబ్బంది కథనం ప్రకారం.. ఓ సాయుధుడు శనివారం మధ్యాహ్నం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనలో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది సాయుధుడిని పట్టుకునేందుకు చూడగా.. తుపాకీతో కాల్పుకుని బలవన్మరణం పొందాడు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ వద్ద చోటుచేసుకున్న భయానక పరిస్థితులకు సంబంధించిన వీడియో ట్వీటర్‌లో వైరల్‌గా మారింది. 

కాగా, శనివారం ఫ్లోరిడా పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతులు సాయంత్రానికి వైట్‌హౌస్‌కు రావాల్సి ఉంది. వారు మరికాసేపట్లో వైట్‌హౌస్‌కు వస్తారని అనుకున్న సమయంలో అక్కడ కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, కాల్పులు జరిగిన సమయంలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌ దంపతులు లేకపోవడం, వారు ఇంకా ఫ్లోరిడా పర్యటనలోనే ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గత నెల 23న ఓ మహిళ తన కారుతో అధ్యక్ష భవనం వద్ద బీభత్సం సృష్టించగా, వైట్ హౌస్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు