కన్నకూతురిపైనే దాడి చేయించిన తండ్రి

13 May, 2020 08:00 IST|Sakshi

సాక్షి, తుమకూరు : ఆస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి మరో ఉదాహరణ. భూమిలో మట్టిని విక్రయం గొడవలో కూతురుపై తండ్రి, బంధువులతో కలిసి దాడి చేసి ఆమె దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు. అల్లున్ని కూడా కొట్టాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాలోని గోపాలపుర గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే   
నోవినకెరె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత ఆమె భర్త సునీల్‌లు ఇద్దరూ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృతకు ఆరేళ్ల కిందట బెంగళూరుకు చెందిన సునీల్‌తో పెళ్లయింది. మార్చిలో గోపాలపుర గ్రామంలో ఉన్న తండ్రి ఇంటికి భర్తతో పాటు వచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ విధించడంతో బెంగళూరుకు వెళ్లలేక పుట్టినింట్లోనే ఉంటున్నారు.  అమృత తండ్రి భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించడం జరిగింది.  ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో అమృత న్యాయం కోసం నోవినకెరె పోలిసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు.

ఇంట్లో దాడి
పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన అమృత, తండ్రి భైరప్పల మధ్య మళ్ళి ఘర్షణ తలెత్తింది. ఆగ్రహానికి గురైన భైరప్ప తన అన్నదమ్ములను బంధువులను పిలిపించి కట్టెలు, కత్తులతో అమృత పైన దాడి చేయించాడు. అమృత తల, భుజాలకు గాయాలై రక్తం ధార కట్టింది. భర్త సునీల్‌కు కూడా గాయాలు కావడంతో ఇద్దరు తిపటూరులో ఉన్న అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భైరప్ప గోపాలపుర జీపీ సభ్యుడు. ఇతడు పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలను హింసిస్తున్నాడని అమృత ఫిర్యాదు చేశారు.    

మరిన్ని వార్తలు