బాస మరచి.. తుది శ్వాస విడిచి  

19 Apr, 2018 10:16 IST|Sakshi
యేషయ్య మృతదేహం

కుటుంబ కలహాలతో మనస్తాపం

చాకుతో గుండెలో పొడుచుకుని యువకుడి ఆత్మహత్య

రెండు కుటుంబాల్లో అలుముకున్న విషాదం

రాయలం గ్రామంలో దుర్ఘటన

భీమవరం టౌన్‌ : ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన కొడుకు. దేశం కాని దేశంలో కష్టపడుతున్నాడని.. నాలుగురాళ్లు వెనుకేసుకుని అతడు సుఖంగా ఉంటే చాలనుకుంది ఓ తల్లి! ముద్దులొలికే ఇద్దరు మగ పిల్లలు. వారి భవిష్యత్తు కోసం తన భర్త దూర దేశంలో కష్ట పడుతున్నా త్వరలోనే అప్పులు తీర్చి కుటుంబం చీకూచింతా లేకుండా ఆనందంగా బతకొచ్చని అనుకుంది ఓ భార్య !.  వారి ఆశలకు, ఊహలకు భిన్నంగా.. పరాయి దేశం వెళ్లి సంపాదిస్తున్న ఆ వ్యక్తి తిరిగి మరొక యువతి, ఆరునెలల పాపతో తిరిగొచ్చాడు.

ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుని రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చాడు. వివరాలలోకి వెళితే.. రామపూడి యేషయ్య(28)ది ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామం. తండ్రి చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి ఉన్నంతలోనే కష్టపడి పెంచింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన తరువాత యేషయ్యకు పెళ్లి చేసింది.

భార్య సుధారాణి, ఇద్దరు మగపిల్లలతో కుటుంబాన్ని కష్టపడి పోషించేవాడు. పెద్ద కుమారుడికి 7 ఏళ్లు, చిన్న కుమారుడికి 4 ఏళ్లు. పిల్లలను బాగా చదివించాలి, కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో యేషయ్య తన భార్య, పిల్లలను కాళ్ల మండలం దొడ్డనపూడిలోని అత్తింటికి పంపి.. తల్లిని స్వగ్రామంలోనే ఉంటున్న సోదరికి అప్పగించి 2015లో కువైట్‌ వెళ్లాడు.

అక్కడ పనిచేస్తుండగా సమీపంలో ఉంటున్న కృష్ణా జిల్లా లక్ష్మీపురం సమీపంలోని పల్లెపాలెం గ్రామానికి చెందిన సముద్రమ్మ అనే యువతితో పరిచయమైంది. ఇరువురు ఆ దేశంలో సహజీవనం చేశారు. ఫలితంగా ఇప్పుడు వారికి 6 నెలల పాప. ఈనెల 6వ తేదీన యేషయ్య సముద్రమ్మ, పాపతో స్వదేశానికి వచ్చాడు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని వీళ్లతో ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు.

17వ తేదీ అర్ధరాత్రి యేషయ్య వంటగదిలోని పదునైన చాకుతో గుండెల్లో పొడుచుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనకు సంబంధించి టూటౌన్‌ ఎస్సై జి.కాళీచరణ్‌ బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యేషయ్య ఇక్కడికి వచ్చిన తరువాత కాళ్ల గ్రామం వెళ్లి భార్య సుధారాణిని కలిశాడు.

అప్పులు తీరాక వస్తానని చెప్పి వెనుకకు వచ్చేశాడు. రాయలం గ్రామం వెళ్లి సముద్రమ్మతో ఘర్షణ పడ్డాడు. డబ్బులు ఎక్కువ ఖర్చుపెడుతున్నావంటూ ఆమెతో గొడవపడి మనస్తాపం చెంది చాకుతో గుండెల్లో పొడుచుకున్నాడు. 108 వాహనానికి సమాచారం అందడంతో వచ్చేసరికే యేషయ్య మృతిచెందాడు.

భార్య సుధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జీవితంలో చేసిన చిన్న పొరపాటు రెండు కుటుంబాలను విషాదంలోనికి నెట్టింది. పిల్లలు తండ్రిలేని వారయ్యారు. 

మరిన్ని వార్తలు