ఇంటికి రానా? బ్రిడ్జిపై నుంచి దూకి చావనా?

19 Apr, 2018 11:29 IST|Sakshi
కరుణకుమార్‌(ఫైల్‌)

భార్య వేధింపులు తాళలేక గోదావరిలోకి దూకి భర్త ఆత్మహత్య

చివరి సారిగా భార్యతో ఫోన్‌లో మాట్లాడి ఈ అఘాయిత్యం..

రాజమహేంద్రవరం క్రైం: భార్య వేధింపులు తాళలేక గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళానికి చెందిన పిరియ కరుణ కుమార్‌(32) పదేళ్ల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన రమ్య అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అడ్రస్‌ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కరుణకుమార్‌ను వెతుక్కుంటూ రాజమహేంద్రవరం వచ్చారు.

కరుణకుమార్‌ తండ్రి ధవళేశ్వరం గ్రామంలో టైలరింగ్‌ పని చేసుకుని జీవిస్తుండగా,  కరుణకుమార్‌ కార్లు అమ్మకం, కొనుగోలు వ్యాపారం చేసుకుంటున్నాడు కరుణ కుమార్, రమ్యలకు ఒక బాబు, పాప ఉన్నారు.  పెళ్లయినప్పటి నుంచి భార్య రమ్యతో మనస్పర్థలు ఉన్నట్టు మృతుడి సోదరుడు మనోజ్, బంధువులు పేర్కొంటున్నారు. ప్రతీ విషయానికి గోడవలు పడడంతో మద్యానికి బానిసైన కరుణకుమార్‌ జీవితంపై విరక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు.

కార్ల అమ్మకాలు లేకపోవడం, భార్యతో గొడవగా ఉండడంతో మంగళవారం కరుణకుమార్‌ తనతో కలిసి కార్లు వ్యాపారం చేసే వీరేంద్రను మోటారు సైకిల్‌పై కొవ్వూరులో కారు ఉంది కొందామని తీసుకువెళ్లాడు. రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద ఫోన్‌లో మాట్లాడేందుకు మోటారు సైకిల్‌ ఆపాడు. భార్యతో ఫోన్‌లో మాట్లాడినట్టు స్నేహితులు పేర్కొంటున్నాడు. 

భార్యతో ఫోన్‌లో మాట్లాడి..

భార్యతో ఫోన్‌లో మాట్లాడే సందర్భంలో కరుణకుమార్‌ ‘‘ఇంటికి రానా? లేక బ్రిడ్జి మీద నుంచి దూకి చావనా?’’ అంటూ భార్యతో అన్నట్టు స్నేహితుడు పేర్కొంటున్నారు. దీనికి భార్య ‘‘దూకి చావు నీకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్నేహితుడికి సెల్‌ ఫోన్‌ ఇచ్చి మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయాన్ని మృతుడి స్నేహితుడు ఫోన్‌లో భార్య రమ్యకు చెప్పగా ‘‘అతడికి, తనకు ఏ విధమైన సంబంధం లేదని, అతని తల్లిదండ్రులకు చెప్పండి’’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. వెంటనే స్నేహితుడు 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

బుధవారం ఉదయం గోదావరిలో నుంచి మృతదేహాన్ని తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు