ప్రాణం తీసిన ఫైనాన్స్‌

22 Sep, 2018 12:44 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబ సభ్యులు, మృతి చెందిన సుధాకర్‌ 

మంచిర్యాలక్రైం : ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. రీఫైనాన్స్‌ పేరిట యాజమాన్య వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామనికి చెందిన ఉప్పులపు సుధాకర్‌ (35) బతుకుదేరువు కోసం మంచిర్యాలకు ఐదేళ్ల క్రితం వలస వచ్చాడు. ఇక్కడ ఆటోడ్రైవర్‌గా, ట్రాక్టర్‌ డ్రైవర్‌గా కొంత కాలం పని చేసి రెండేళ్ల క్రితం ఓ సెకండ్‌ హ్యాండ్‌ ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. ఆ ట్రాక్టర్‌పై పట్టణంలోని రామాంజనేయ ఫైనాన్స్‌లో రూ.లక్ష 50వేలు అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో సుధాకర్‌ కిస్తీల రూపంలో రూ.లక్ష 20వేలు చెల్లించాడు. ఇంకా రూ.84వేలు చెల్లించాల్సి ఉండగా గడువు దాటినందున వడ్డితో కలిపి రూ.లక్ష 4వేలు చెల్లించాలని నిర్వాహకులు చెప్పడంతో ఒప్పుకున్నాడు.

ఈ నేపథ్యంలో కిస్తీలు కట్టడం ఆలస్యమైనందున ఫైనాన్స్‌ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. ఒక రోజు పిలిపించి ముందు తీసుకున్న ఫైనాన్స్‌ను సుధాకర్‌ అనుమతి లేకుండా రీ ఫైనాన్స్‌చేసి మొత్తం రూ.3లక్షల 70వేలు కట్టాలని బెదిరించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో ఫైనాన్స్‌ యాజమాన్యం వేధింపులు భరించలేక సుధాకర్‌ ఈ నెల 20న రాత్రి సినిమాకు వెళుతున్నాని చెప్పి వెళ్లి ఇంటికి రాలేదు. 21న సాయంత్రం స్థానికులు కొందరు వెతుకుతుండగా ఇంటికి కొంత దూరంలో పార్కింగ్‌ చేసిన ట్రాక్టర్‌ వద్ద అతడి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించగా సూసైడ్‌ నోట్, పురుగుల మందు ఖాళీ డబ్బా లభించింది. సుధాకర్‌కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు వర్షిత్, వంశీకృష్ణ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, సూసైట్‌ నోట్‌ ఆ«ధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన ... 
సుధాకర్‌ మృతికి కారకులైన రామాంజనేయ ఫైనాన్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు స్థానికులు ఆసుపత్రి ఎదుట గల రహదారిపై ఆందోళన చేపట్టారు. ఫైనాన్స్‌ యాజమాన్య వేధింపుల కారణంగానే సుధాకర్‌ మృతిచెందాడని ఆరోపించారు. ఫైనాన్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ మహేశ్‌ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.  

సూసైడ్‌ నోట్‌... 
నా చావుకు కారణం రామాంజనేయ ఫైనాన్స్‌ వారే. ఎందుకంటే నేను బండి కొన్నప్పుడు రూ.1.50లక్షలు తీసుకున్నాను. దానికి రూ.2లక్షల 4వేలు అవతాయని అన్నారు. తరువాత నేను రూ.1.20లక్షలు కట్టాను.  కానీ వాళ్లు ఇచ్చిన డేట్‌ దాటి పోయింది. ఇంకా రూ.1లక్ష 4వేలు నేను ఇవ్వాలి. కానీ నాకు తెలియకుండానే రీ ఫైనాన్స్‌ చేశారు. ఎందుకు చేశారు అంటే నీవు డబ్బులు కట్టలే కాబట్టి మేం చేశాం అని అన్నారు. ఎంత ఫైనాన్స్‌ అంటే రూ.3 లక్షల 70వేలు ఇవ్వాలని అన్నారు. అయితే నేను సంతకాలు పెట్టలే అంటే నీవు పెట్టకుంటే మాకు తెలియదు అన్నారు. నేను సీఐ గారి దగ్గరికి పోతా అంటే నీవు సీఐ దగ్గరకు పో...  ఎమ్మెల్యే దగ్గరికి పో... నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అన్నారు. అన్నా నేను లేటు చేసాను ..దానికి రూ. 90వేలు కడుతా అని అన్నాను.  కానీ వాళ్లు ఇనలేదు. ఎక్కువ మాట్లాడితే సుధాకర్‌ నీ బండి నీ చేతికి రాదని అన్నారు. నా చావుకు మాత్రం రామాంజనేయ ఫైనాన్స్‌వారే బాధ్యులు. 
ఇట్లు 
జి. సుధాకర్

మరిన్ని వార్తలు