దాయాదులే నిందితులు..!

26 Aug, 2019 09:17 IST|Sakshi

వీడిన హత్య కేసు మిస్టరీ

చేతబడి నెపంతోనే ఘాతుకం

నలుగురు నిందితుల అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు

కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి

సాక్షి, భువనగిరి: అనుమానం పెనుభూతమైంది. తన భార్యకు చేతబడి చేయడంతోనే అనారోగ్యం బారిన పడిందని అనుమానించాడు. అందుకు కారణమైన వ్యక్తిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదునుచూసి వెంబడించి వేటాడి ఘాతుకానికి ఒడిగట్టాడు. వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన బోయిని శంకరయ్యను దాయాదులే మట్టుబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ శివా రులో ఈ నెల 23న చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోదంతా నికి పాల్పడిన నలుగురు నిందితులను శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని వలిగొండ గ్రా మానికి చెందిన బోయిన ఎట్టయ్య కుమారుడు శంకరయ్య(62) ఒగ్గు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఎట్టయ్య పాలివారైన బోయిని బుచ్చయ్య కుమారుడు శంకరయ్య 20ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి చికెన్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

బంధువు చనిపోతే..
రెండేళ్ల క్రితం గ్రామానికి చెందిన బోయిన ఎట్టయ్య, బుచ్చయ్య బంధువు చనిపోయాడు. అంత్యక్రియలకు హైదరాబాద్‌లో ఉంటున్న శంకరయ్య కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఆ సందర్భంలో  శంకరయ్య వరుసకు కుమారుడైన శంకరయ్య భార్య చెవులను పట్టుకుని మాట్లాడాడు. అప్పటినుంచి శంకరయ్య భార్యకు చెవులు లాగడం, కడుపులో నొప్పిగా ఉండడం ఇతరత్ర అనారోగ్యాల బారిన పడింది. అయితే తన భార్య అనారోగానికి వరుసకు బాబాయి అయిన శంకరయ్య చేతబడి చేయడమే కారణమని భావించాడు.

కక్ష పెంచుకుని..
తన భార్య అనారోగ్యం భారిన పడడానికి  బాబాయి శంకరయ్యే కారణమని శంకరయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని శంకరయ్య నిర్ణయించుకున్నాడు. అందుకు అదునుకోసం వేచి చూస్తున్నాడు. కొ ద్దిరోజులుగా శంకరయ్య కదలికలపై నిఘా పెట్టించాడు. 

ఒక్కడి వల్ల కాదని..
అయితే, బాబాయి శంకరయ్యను హత్య చేయడం తన ఒక్కడి వల్ల కాదని భావించిన శంకరయ్య తన చికెన్‌ దుకాణంలో పనిచేసే టేచౌత సాయికిరణ్, సంగెం గ్రామానికే చెందిన బోయిని ప్రభాకర్, బోయిని యాదయ్యలను ఆశ్రయించాడు. వరుసకు బాబాయి అయ్యే శంకరయ్యను హత్య చేసేందుకు సహకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

వెంటాడి.. వేటాడి..
సంగెం గ్రామానికి చెందిన శంకరయ్య ఈ నెల 23(శుక్రవారం)న చౌటుప్పల్‌ మండలం వాయిళ్లపల్లి గ్రామంలో ఓ ఇంట్లో ఒగ్గుకథ చెప్పేం దుకు ఉదయం వెళ్లాడు. అప్పటికే సమాచారం ఉన్న శంకరయ్య హైదరాబాద్‌ నుంచి స్కార్పియో వాహనంలో తన దుకారణంలో పనిచేసే సాయికిరణతో కలిసి చౌటుప్పల్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న సంగెం గ్రామానికి చెందిన ప్రభాకర్, యాదయ్యలను కలుసుకున్నాడు. శంకరయ్య వాయిళ్లపల్లికి కథ చెప్పడానికి వెళ్లాడని తెలుసుకుని అక్కడే మాటేశారు. ఒగ్గుకథ పూర్తయిన తర్వాత శంకరయ్య ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అదే దారిలో స్కార్పియో వాహనంలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు శంకరయ్యను వెంబడించారు. సరిగ్గా సంగెం గ్రామ శివారులోకి రాగానే శంకరయ్య బైక్‌ను స్కార్పియోతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకరయ్య బైక్‌పైనుంచి ఎగిరి కిందపడడంతో వెంటనే స్కార్పియో నుంచి దిగిన శంకరయ్య, సాయికిరణ్‌ కత్తులతో అతడి గొంతు కోసేశారు. అనంతరం చెవులను కోసుకుని అక్కడినుంచి అదే వాహనంలో పరారయ్యారు. కాసేపు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన శంకరయ్య ప్రాణాలు విడిచాడు. 

అనుమానంతో అదుపులోకి తీసుకోగా..
శంకరయ్య తండ్రి ఎట్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే మొదట శంకరయ్య ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే హత్య చేసిన అనంతరం బుచ్చయ్య కుమారుడు శంకరయ్యపై పోలీసులకు అనుమానం కలిగింది. స్కార్పియో వాహనంలో ఆదివారం అతడు సాయికిరణ్‌తో కలిసి హైదరాబాద్‌కు వెళుతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. హత్యోదంతంలో పాల్గొన్న బోయిని ప్రభాకర్, యాదయ్యలను కూడా అరెస్ట్‌ చేసి కేసు నమో దు చేసినట్టు డీసీపీ వివరించారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో  ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్, స్థానిక ఎస్‌ఐ శివనాగప్రసాద్,పోలీసు సిబ్బంది  పాల్గొన్నారు .

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా