రక్తపు మడుగులో యువకుడు

8 Aug, 2018 13:39 IST|Sakshi

కంకిపాడు (పెనమలూరు) : రక్తపు మడుగులో ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఘటన మండల కేంద్రమైన కంకిపాడులో మంగళవారం చోటు చేసుకుంది. హత్యాయత్నం జరిగిందా?, లేక ఆత్మహత్యాయత్నం చేశాడా? కారణాలు ఏమిటి? అన్నవి ప్రశ్నలుగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని లాకురోడ్డు మద్యం దుకాణం వెనుక రోడ్డులో రియల్‌ వెంచర్‌ ఉంది. ఈ వెంచర్‌లోని ఓ ఖాళీ రేకుల షెడ్డులో రక్తపు మడుగులో ఓ యువకుడు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు రక్తపు మడుగులో ఎడమ చెవికి గాయమై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మద్యం అధికంగా సేవించి ఉన్నట్లు నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి (30) ని 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు లభ్యం కాలేదు.

హత్యాయత్నమా?... ఆత్మహత్యాయత్నమా...?
ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించేందుకు తరచూ ఇక్కడ ఉన్న వెంచర్‌లోకి మందుబాబులు వెళ్తుంటారు. అలాగే వెళ్లిన వ్యక్తుల్లో మద్యం తాగాక ఘర్షణ ఏర్పడి దాడికి దారి తీసిందా?, లేక మద్యం మత్తులో తనకు తాను గాయపర్చుకున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మద్యం దుకాణం వద్ద, లాకు రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సేకరిస్తే కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తెలివిలోకి వస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు