మామిడిపండు కోశాడని..

30 May, 2019 13:42 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో బక్కి శ్రీను మృతదేహం న్యాయం కోరుతూ సింగంపల్లిలో మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న మృతుడి బంధువులు

సింగంపల్లిలో ఓ యువకుడిని

బంధించిన తోట కౌలుదారులు

కొద్దిసేపటికే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి

పంచాయతీ కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరి

హత్యేనంటున్న బంధువులు

న్యాయం చేయాలని మృతుడి బంధువులు రాస్తారోకో, ధర్నా

భారీగా మోహరించిన పోలీసులు

రంగంపేట(అనపర్తి) : రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక మామిడి తోటలో మామిడికాయలు దొంగతనం చేశాడన్న నెపంతో గొల్లలమామిడాడకు చెందిన బక్కి శ్రీను(35) అనే వ్యక్తిని మామిడితోటకు సంబంధించిన స్థానిక వ్యక్తులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించగా మరలా కొద్దిసేపు తరువాత కార్యాలయం తలుపులు తెరిచి చూసే సరికి పంచాయతీ కార్యాలయంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

గొల్లలమామిడాడకు చెందిన బక్కి శ్రీను తన భార్య కుమారి, ఇద్దరు పిల్లలను అత్తవారింటికి తీసుకువెళ్లి వారిని అక్కడ వదిలి వస్తూ సింగంపల్లిలో మామిడితోటలో మామిడి పండు కోసుకుని తిన్నాడు. ఇది చూసిన తోట కౌలుదారులు కడియం నాగేశ్వరరావు, ఎం.రామకృష్ణ ఆగ్రహించి శ్రీనుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి స్థానిక పెద్దల సమక్షంలో తగువు పెట్టిస్తామని చెప్పి పంచాయతీ కార్యాలయంలో అతడిని బంధించి వెళ్లారు. వారు  మళ్లీ తిరిగి వచ్చేసరికి ఉరి వేసుకుని శ్రీను చనిపోయాడని వారు చెబుతుండగా, మృతుడి బంధువులు మాత్రం శ్రీనును తీవ్రంగా కొట్టి హింసించి చంపేసి, ఉరి వేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సంఘటన స్థలం నుంచి కదిలేదిలేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌  స్తంభించింది. గ్రామంలో పరిస్ధితులు అదుపు తప్పడంతో భారీగా పోలీసు బలగాలను రప్పించారు. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకటరమారావు, పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు, సీఐ యువకుమార్, రంగంపేట ఎస్సై దుర్గాశ్రీనివాసరావు మృతుడి బంధువులు, మాలమహానాడు నాయకులతో చర్చలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు