అద్దె కట్టడం లేదని దొంగతనం చేశాడు, ఇంతకు అవి ఏంటంటే..

24 Jul, 2018 15:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అద్దె చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు, లేదంటే ఏవైన ఖరీదైన వస్తువులను తాకట్టు పెట్టుకుంటారు. కానీ నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా అద్దెకున్న వ్యక్తి సామాగ్రిని దొంగతనం చేశాడు. అది కూడా ఏ టీవీనో, బైకో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే అతడు దొంగతనం చేసింది దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే పుస్తకాలను.  వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.

వివరాల ప్రకారం నికెథన్‌ అనే వ్యక్తి పుస్తకాలు విక్రయిస్తుంటాడు. అమ్మకం కోసం తెచ్చిన పుస్తకాలను భద్రపరిచేందుకు నగరానికి చెందిన శ్రీనివాస రెడ్డికి సంబంధించిన గోదాంను అద్దెకు తీసుకున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఆగ్రహించిన శ్రీనివాస రెడ్డి నికెథన్‌కు సంబంధించిన దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను దొంగతనం చేశాడు. ఇలా దొంగతనం చేసిన పుస్తకాలను  శ్రీనివాస రెడ్డి, బేగం బజార్ కి చెందిన పుస్తక వ్యాపారి రజీయుద్దీన్‌కి కిలోల చొప్పిన 17 లక్షల రూపాయలకు అమ్మేశాడు.

రజీయుద్దీన్ ఆ పుస్తకాలను ముంబైకి చెందిన పుస్తక వ్యాపారి దాంజీకి 22 లక్షల రూపాయలకు విక్రయించాడు. పుస్తకాలు చోరి అయిన విషయం గుర్తించిన నికెథన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నికెథన్‌ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాస రెడ్డిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో శ్రీనివాస రెడ్డి తాను, తన తండ్రి నరసింహారెడ్డితో కలిసి నికెథన్‌ పుస్తకాలను దొంగిలించామని ఒప్పుకున్నాడు. అనంతరం శ్రీనివాస రెడ్డి, అతని తండ్రి నరసింహారెడ్డిలతో పాటు పుస్తకాలు కొన్న రజీయుద్దీన్‌ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ‘ఇంత ఖరీదైన పుస్తకాల దొంగను పట్టుకోవడం ఇదే ప్రథమం. గోదాం యజమని నరసింహా రెడ్డి , కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు  రజీయుద్దీన్‌ను కూడా అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుంచి 3.24 కోట్ల రూపాయల ఖరీదైన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో ఇండియన్ హిస్టరీ, అట్లాస్ ఆఫ్ మై వరల్డ్ , అవర్ ఎర్త్ , స్పీరిట్ ఆఫ్ ఇండియా బుక్స్ ఉన్నాయి.ఈ పుస్తకాలు అన్ని అత్యంత ఖరీదైన పుస్తకాలుగా గుర్తించాం. వీటి విలువ ఒక్కటి 15 వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకూ ఉంటుంది. మొత్తం ఆరు లారీలు పుస్తకాలు ను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు