మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ

11 Sep, 2019 10:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆలస్యంగా వెలుగులోకి..

సాక్షి, నెల్లూరు: వృద్ధురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి (జీజీహెచ్‌)లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ (82)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి వివాహాలయ్యాయి. భర్త రమణారెడ్డి పదేళ్ల క్రితం మృతిచెందడంతో రామసుబ్బమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గుండెనొప్పిగా ఉండటంతో ఆగస్టు 28వ తేదీన ఆమె వైద్యపరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే నిమిత్తం పంపారు. ఎక్స్‌రే తీయించుకున్న అనంతరం ఆమె వైద్యులను కలువగా రిపోర్ట్‌ రావడం ఆలస్యమవుతోందని మరుసటిరోజు రావాలని సూచించారు. దీంతో ఆమె వార్డు నుంచి బయటకు రాగా ఇద్దరు గుర్తుతెలియని మహిళలు మాటలు కలిపారు.

డాక్టర్‌ మధ్యాహ్నం మూడుగంటల వరకు ఉంటారని, రిపోర్ట్‌ మధ్యాహ్నం తీసుకుని ఒకేసారి డాక్టర్‌కు చూపించుకుని వెళ్లాలని ఆమెకు చెప్పారు. దీంతో రామసుబ్బమ్మ అక్కడే ఉండిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ ఇద్దరు మహిళలు ఆమెకు భోజనం పెట్టి, కూల్‌డ్రింక్‌ ఇచ్చారు. అది సేవించిన రామసుబ్బమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆ మహిళలు ఆమె ఒంటిపై ఉన్న 8.5 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అపస్మారకస్థితిలో ఉన్న రామసుబ్బమ్మను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది అత్యవసర చికిత్స విభాగంలో చేర్పించారు. అనంతరం ఆమె కుమారుడికి తెలియజేశారు. 29వ తేదీ ఆమె మత్తు నుంచి తేరుకున్న అనంతరం కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది సోమవారం రాత్రి దోపిడీ ఘటనపై దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు