మున్నాభాయ్‌ దాదాగిరీ

18 May, 2019 10:52 IST|Sakshi
పోలీసుల అదుపులో మున్నాభాయ్, అనుచరులు, రివాల్వర్‌

అప్పు కట్టలేదని ఇంట్లోకి చొరబడి రభస

రివాల్వర్‌తో మహిళలకు బెదిరింపులు

బెంగళూరు : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు రుణదాత అనుచరులతో వచ్చి రివాల్వర్‌తో బెదిరించిన ఘటన మాలూరు తాలూకాలోని జయమంగల గ్రామంలో చోటు చేసుకుంది. తుపాకీతో హల్చల్‌ చేయడం చూసి గ్రామస్థులు మూకుమ్మడిగా తిరగబడడంతో తోకముడిచారు. తాలూకాలోని లక్కూరు ఫిర్కా జయమంగల గ్రామంలో బోళేగౌడ అనే వ్యక్తి బెంగుళూరుకు చెందిన హేమంత్‌ అలియాస్‌ మున్నాభాయ్‌ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. వడ్డీలు, అప్పు చెల్లించలేదంటూ ఆ వ్యక్తి తన అనుచరులు అయిన సురేష్, మంజునాథ్, నబీద్‌ అనే వారితో జయమంగల గ్రామంలోని బోళేగౌడ ఇంటికి వచ్చాడు.

ఇంట్లో ఉన్న బోళేగౌడ భార్య కామాక్షమ్మ, కూతురు అంజలీదేవి తలుపులు తెరిచారు. వెంటనే వారు లోపలికి చొరబడి అప్పు కట్టకుంటే చంపేస్తామని రివాల్వర్‌తో బెదిరించారు. ఇంట్లో భర్త లేడని చెప్పినా వినిపించుకోకుండా వారితో గొడవ పడ్డారు. ఈ సమయంలో కామాక్షమ్మ, కూతురు అంజలీదేవి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఇండ్ల వారు అక్కడికి రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై అనంతరం బోళేగౌడ కుటుంబం మాలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు