‘నా దగ్గర గ్రెనేడ్‌ ఉంది.. ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేస్తాను’

3 Nov, 2018 17:04 IST|Sakshi

లక్నో : అమెరికా మియామి ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేస్తానంటూ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేస్తోన్న 18 ఏళ్ల ఉత్తరప్రదేశ్‌ యువకున్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) అధికారులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. యూపీకి చెందిన సదరు నిందుతుడు కొన్ని రోజుల క్రితం 1000 అమెరికన్‌ డాలర్లు విలువ చేసే బిట్‌ కాయిన్స్‌ని కొన్నాడు. ఈ క్రమంలో అతడు మోసపోయాడు. దాంతో ఈ విషయం గురించి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేశాడు. కానీ వారి నుంచి అతనికి సరైన సమాధానం లభించలేదు.

దాంతో విసుగు చెందిన సదరు యువకుడు మియామి విమానాశ్రయానికి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేయడం ప్రారంభించాడు. గత నెల 2, 31 తేదీలలో వరుస కాల్స్‌ చేశాడని అధికారులు తెలిపారు. ‘నేను మియామి విమానాశ్రయాన్ని పేల్చేస్తాను. నా దగ్గర ఏకే 47 గన్‌, గ్రెనేడ్‌, సూసైడ్‌ బెల్ట్‌ ఉన్నాయి. వాటితో మీ అందరిని చంపేస్తాను’ అంటూ మియామి విమానాశ్రయ అధికారులకు ఇంటర్నెట్‌ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రెస్‌ ట్రేస్‌ చేసి నిందితున్ని గుర్తించారు. బిట్‌కాయిన్స్‌ కొని మోసపోయిన తాను ఆ కోపంలో విమానాశ్రయానికి ఫోన్‌ చేసి బెదిరించినట్లు నిందుతుడు విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద సదరు యువకుడి మీద కేసు నమోదు చేసినట్లు ఏటీఎస్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు