దుండగుడి చేష్టలతో యువతికి నిద్ర లేని రాత్రి

6 Feb, 2020 12:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: ఒంటరిగా నివాసముంటోన్న ఓ యువతి ఇంట్లోకి ఆగంతకుడు చొరబడేందుకు ప్రయత్నించడమే కాక కిటికీలో నుంచి కండోమ్‌ ప్యాకెట్లు విసిరి పారిపోయిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. అయితే పోలీసులు సైతం సహాయమందించలేకపోవడంతో ఆ రోజు ఆమెకు నిద్రలేని రాత్రే అయ్యింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన మనీషా(పేరు మార్చాం) అనే ఉద్యోగిని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో జనవరి 30న  ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న శబ్ధాలు వినిపించాయి. రానురానూ ఈ శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉదయం 2 గంటల సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసింది.

ఇంతలో దుండగుడు ప్రధాన ద్వారం దగ్గర ఉన్న కిటికీను తెరిచి అందులోనుంచి చేయి పోనిచ్చి తలుపు గొళ్లెం తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అక్కడికి దగ్గర ఉన్న స్విచ్‌బోర్డుపై చేయి పడగా హాల్‌లోని లైట్లు వెలిగాయి. అంతే.. అతను భయంకరంగా మేడమ్‌, మేడమ్‌ అని అరుస్తూ లైట్లు ఆన్‌ చేస్తూ, ఆఫ్‌ చేస్తూ ఆమెను మరింత భయపెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు తలుపులపై బాదుతూ, కాలింగ్‌ బెల్‌ కొట్టాడు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో వారిని గమనించిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా పోలీసులు ఆ రాత్రి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన యువతికి నిరాశే ఎదురైంది. కేవలం ఒక ఫోన్‌నెంబర్‌ ఇచ్చి మళ్లీ ఏదైనా జరిగితే కాల్‌ చేయండని చెప్పారు. ‘అంటే మళ్లీ జరిగేవరకు నేను ఎదురు చూడాలా?’ అని అంటున్న మాటలను కూడా పట్టించుకోకుండా అక్కడ నుంచి నిష్క్రమించారు. అయితే పోలీసులు కనీసం ఇంటి చుట్టుపక్కల కూడా వెతక్కుండానే వెళ్లిపోయారు’’ అని ఆమె వాపోయింది. (అనూహ్య ఘటన: బలవంతంగా యువతికి తాళి కట్టాడు)

కండోమ్స్‌ చూసి షాక్‌
ఎప్పటిలాగే ఆ తర్వాతి రోజు ఆఫీస్‌కు సిద్ధమవుతున్న మనీషా ఫ్రిడ్జ్‌ దగ్గరలో కనిపించిన కండోమ్స్‌ ప్యాకెట్స్‌ చూసి షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారమందించగా... వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంటికి చేరుకుని ఏం పర్లేదని చెబుతూ దాన్ని అవతలకు పారేశారు. దీంతో యువతి ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. ఆ అపార్ట్‌మెంట్‌ యజమానిని సంప్రదించి సీసీటీవీ ఫుటేజీని సేకరించింది. అందులో దుండగుడిని ఒకటికి పదిమార్లు నిశితంగా పరిశీలించిన పిదప, తానెప్పుడూ అతన్ని చూడలేదని నిర్ధారించుకుంది. ఇక సీసీటీవీలో అతను మరో ఇంటివద్ద కూడా ఇలానే ప్రవర్తించడం రికార్డైంది. అక్కడ కూడా కిటికీ తలుపులు తెరుస్తూ, మూస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించాడు.

ఎవరికీ పట్టింపు లేదు 
ఈ ఘటనపై మనీషా ఆధారాలతో సహా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు కండోమ్‌ ప్రస్తావన వదిలేయమన్నారు. దీనికి తాను ససేమిరా ఒప్పుకోకపోవడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ స్వీకరించలేదని ఆమె పేర్కొంది. తనకు పోలీసుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సామాజిక కార్యకర్త దీపిక నారాయణ్‌ భరద్వాజ్‌కు ట్విటర్‌లో తన గోడు వెళ్లబోసుకుంది. పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకోలేదని వెల్లడించింది. దీనిపై సత్వర న్యాయం చేపట్టాలని ఆమె పోలీసు శాఖను కోరగా ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసు అధికారులు పేర్కొనటం గమనార్హం. మరోవైపు అపార్ట్‌మెంట్‌లో సెక్యురిటీ సిబ్బందిని నియమించాలన్న విజ్ఞప్తిని సైతం యజమాని కొట్టిపారేశాడు. వీరి నిర్లక్ష్యంతో విసుగు చెందిన మనీషా మూడేళ్లుగా ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడానికి సిద్ధపడింది. తనకు రక్షణ కల్పించే ఇంటి కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

చదవండి: 

భార్యను భయపెట్టడానికి...

మరిన్ని వార్తలు