ఆరు నెలల గర్భిణిపై కిరాతకం

2 Mar, 2018 12:15 IST|Sakshi
బాధితురాలు ములుగూరి రాణి

కడుపు, నడుములపై తన్నిన వైనం

అడ్డుకున్న స్థానికులు

చికిత్స అనంతరం పోలీసులను ఆశ్రయించిన దంపతులు

సాక్షి, గుంటూరుఈస్ట్‌: భార్యాభర్తలను కొట్టి, ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ కిరాతకుడు. చుట్టు పక్కల వారు అడ్డుకుని, బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం బాధితులు పాతగుంటూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ములుగూరి రాణి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్‌ మండలం బుడంపాడు ఎస్సీ కాలనీకి చెందిన ములుగూరి రాణికి చిన్నతనంలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో షాపుల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. 2017 ఆగస్టులో పాతగుంటూరుకు చెందిన ఎం.శ్రీనివాస్‌ను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకుంది. ఆర్టీసీ కాలనీ 5వ లైనులో కాపురం పెట్టారు.

ఈనెల 25న పాత స్నేహితుడైన శారదాకాలనీకి చెందిన వివాహితుడు తురకా సునీల్‌ ఆమె ఇంటికి వచ్చి భర్తను వదిలేసి తన వెంట రావాలంటూ ఒత్తిడి చేశాడు. రాణి తిరస్కరించడంతో తీవ్రంగా కొట్టి ఆమె సెల్‌ఫోన్‌ పగులకొట్టాడు. ఇంటికి చేరుకున్న భర్త శ్రీనివాస్‌ను కూడా కొట్టి ఆమెను వదిలిపెట్టి వెళ్లాలని బెదిరించాడు. చుట్టుపక్కల వారు కలుగజేసుకుని సునీల్‌ను వారించి పంపించి వేశారు. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో సునీల్‌ తన మిత్రుడు రామారావును వెంటపెట్టుకుని మళ్లీ రాణి ఇంటికి వచ్చి భార్యా భర్తలిద్దరిని తీవ్రంగా కొట్టారు. ఆమె మెడలోని గొలుసును, చేతి పర్సులో ఉన్న మరో బంగారు గొలుసును లాక్కున్నారు. గొడవను గమనించిన చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చి పిలిపించడంతో విషయాన్ని తెలుసుకుని సునీల్, రామారావు అక్కడి నుంచి పరారయ్యారు.

గర్భంపై తన్నిన నిందితుడు
ఆరు నెలల గర్భిణి అయిన రాణి పొట్ట మీద మీద, నడుము మీద సునీల్‌ తన్ని, కొట్టి గాయపరిచాడు. గురువారం దంపతులు ఇద్దరు పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సునీల్‌ నేర స్వభావం కలవాడని, అతనికి ఉన్న పలుకుబడితో ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడని రాణి కన్నీరుమున్నీరయింది. తనకు తన భర్తకు ఎటువంటి అండ లేని కారణంగా పోలీసులే రక్షణ కల్పించాలని వేడుకుంది.  

మరిన్ని వార్తలు