గోళ్లు కొరుక్కునే ఉత్కంఠ.. ఇంతలో..

23 Sep, 2019 08:56 IST|Sakshi

చెన్నై : దూరమైన భార్యను తన చెంతకు చేర్చాలని, లేకపోతే తనను తాను నాటుబాంబులతో పేల్చుకుని చస్తానని ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తి కారణంగా ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడలూరు జిల్లా నైవేలికి చెందిన మణికందన్‌ భార్య అతడితో గొడవల కారణంగా ఏడాదినుంచి దూరంగా ఉంటోంది. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే మణికందన్‌కు భార్యనుంచి విడిపోవటం ఇష్టం లేదు. విడాకులు వస్తే భార్య శాశ్వతంగా దూరమవుతుందని అతడు భావించాడు. దీంతో ఆదివారం మణికందన్‌ మెడలో నాటుబాంబుల దండ వేసుకుని, కిరోసిన్‌ను తలపై పోసుకుని ఇంటిముందుకు చేరుకున్నాడు. తన భార్యను తనతో కలపాలని లేకపోతే బాంబులు పేల్చుకుని చస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి తీరుతో షాక్‌కు గురైన కుటుంబసభ్యులు, స్థానికులు ప్రయత్నం మానుకోమని అతడ్ని బ్రతిమాలారు. అతడు ఇందుకు ఒప్పుకోలేదు.

అదే సమయానికి అటువైపుగా వెళుతున్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మణికందన్‌ను ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. తన సహోద్యోగులకు సమాచారం అందించి, మణికందన్‌ కుమారుడిని వెంటనే తీసుకురావాలని కోరాడు. కొద్దిసేపటి తర్వాత వారు అతడి రెండేళ్ల కుమారుడిని అక్కడికి తీసుకొచ్చారు. ఆ కానిస్టేబుల్‌ బాబును అతడి ముందు వదిలాడు. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ మణికందన్‌ దగ్గరగా వెళ్లాడు. బాబు భవిష్యత్‌ కోసమైనా ఆత్మహత్య ప్రయత్నం మానుకోవాలని ఆ పోలీస్‌ అతడికి చెప్పాడు. కుమారుడిని చూడగానే మణికందన్‌ తన ప్రయత్నాన్ని మానుకున్నాడు. చిన్నారిని ఒళ్లోకి తీసుకుని ఏడ్వటం ప్రారంభించాడు. పోలీసులు వెంటనే అతడి దగ్గరకు చేరకుని మెడలోని నాటుబాంబులను తొలగించారు. తాను అంతకు క్రితమే విషం తీసుకున్నానని మణికందన్‌ చెప్పటంతో వారు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా