డబ్బు కోసం దారుణ హత్య

13 May, 2020 09:10 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగలు, కొడవలి 

దంపతులపై కొడవలితో దాడి చేసిన యువకుడు 

భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు 

బాధితుల వద్ద 23 సవర్ల బంగారు నగలు చోరీ 

నిందితుడు అరెస్ట్‌  

సాక్షి, పెదకూరపాడు: డబ్బు కోసం ఓ యువకుడు దంపతులపై దాడి చేశాడు. భర్త ప్రాణాలు తీసి, భార్యను గాయపరిచి బంగారు నగలను చోరీ చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలోని కాశిపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.  పులిపాటి రాధాకృష్ణమూర్తి (56), అతని భార్య శివవెంకటనరసమ్మ గ్రామంలో చిన్న దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అలియాస్‌ పిల్ల గోపి ఇటీవల కృష్ణమూర్తి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిలోకి అద్దెకు వచ్చాడు. కృష్ణమూర్తి దంపతులకు తెలియకుండా సోమవారం రాత్రి వారి ఇంటిలోకి గోపి చొరబడ్డాడు.  దీన్ని గమనించిన కృష్ణమూర్తి గోపిని  ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. (మందు కోసం అప్పుడు తల్లిని, ఇప్పుడు కొడుకును)

డబ్బు, నగలు ఇవ్వకుంటే చంపేస్తానని గోపి బెదిరించడంతో కృష్ణమూర్తి దంపతులు కేకలు వేశారు.  దీంతో భయంతో గోపి కోడవలితో దంపతులపై దాడి చేశాడు. దంపతులు మృతి చెందారని భావించి నరసమ్మ ఒంటిపై ఉన్న 23 సవర్ల బంగారాన్ని దొంగిలించి పారిపోయాడు. కృష్ణమూర్తి మృతి చెందగా, నరసమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నరసమ్మ స్పృహలోకి వచ్చి గుంటూరులో ఉంటున్న పెద్దకుమారుడు సురేష్‌కు ఫోన్‌లో విషయాన్ని చెప్పింది.

సురేష్‌ వెంటనే అదే గ్రామంలో ఉన్న తమ బంధువు పుల్లారావుకు సమాచరమివ్వగా, అతడు వెంటనే 108, 100కి డయల్‌ చేసి విషయం చెప్పారు.  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నరసమ్మను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.  నిందితుడు గోపి మంగళవారం ఉదయం చుట్టుపక్కల వాళ్లతో కలిసి ఈ దారుణంపై చర్చించి దొంగలు పడినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. నరసమ్మ ప్రాణాలతో బయటపడటం, జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు గోపిని అరెస్ట్‌ చేశారు.  అతడి నుంచి రూ.6 లక్షల విలువజేసే నగలను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా