4 వేలకు ఆశ పడితే..

27 Jul, 2018 01:49 IST|Sakshi

35 వేల అమెరికన్‌ డాలర్లు తీసుకుని పరారీ 

కమీషన్‌ ఆశ చూపించి బురిడీ 

తెల్ల కాగితాలు అంటగట్టిన నిందితుడు 

పోలీస్‌స్టేషన్‌ వద్ద బాధితుడు జాఫర్‌

హైదరాబాద్‌ : నాలుగు వేల రూపాయల అదనపు కమిషన్‌కు ఆశపడిన ఓ ఏజెంట్‌ రూ.25 లక్షలకు మోసపోయిన ఘటన నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 35 వేల అమెరికన్‌ డాలర్లను తీసుకుని తెల్ల కాగితాలు ఇచ్చి అతడిని బురిడీ కొట్టించాడో ఘరానా మోసగాడు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాంఘర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మోహిన్‌ అమెరికా డాలర్లు కావాలంటూ వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని రెండ్రోజుల క్రితం పాతబస్తీకి చెందిన రఫీక్‌ అనే ఏజెంట్‌ వద్దకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి 2,700 అమెరికా డాలర్లను తీసుకుని నగదు చెల్లించాడు.

మార్కెట్‌ రేటు కంటే అదనంగా కమీషన్‌ చెల్లించాడు. బుధవారం మరో 35 వేల డాలర్లు కావాలంటూ ఆ వ్యక్తి మోహిన్, రఫీక్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారం ఫోన్‌లో సాగింది. రఫీక్‌ వద్ద అంత మొత్తంలో అమెరికన్‌ డాలర్లు లేకపోవడంతో మరో ఏజెంట్‌ జాఫర్‌కు సమాచారం ఇచ్చాడు. జాఫర్‌ 35 వేల డాలర్లు సమకూరుస్తానని గురువారం మధ్యాహ్నం వరకు టైం తీసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి డబ్బు రెడీగా ఉందని డాలర్లు అత్యవసరంగా కావాలంటూ రఫీక్‌కు ఫోన్‌ చేశాడు. తాను గచ్చిబౌలిలోని కాఫీ డెల్‌ వద్ద కలుస్తానని సమాచారం ఇచ్చాడు. 4.30 గంటల ప్రాంతంలో రఫీక్, మోహిన్, జాఫర్లు 35 వేల డాలర్లను తీసుకుని హోటల్‌కు చేరుకున్నారు.

అప్పటికే హోటల్‌లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి.. వారి నుంచి డాలర్లను తీసుకుని రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగును వీరికి అందించాడు. డబ్బు బండిళ్లలో పైన అసలైన నోట్లు పెట్టి లోపల తెల్లకాగితాలను అమర్చాడు. డబ్బు లెక్కిద్దామని ముగ్గురూ అడగ్గా.. గుర్తుతెలియని వ్యక్తి వారిని తుపాకీతో బెదిరించి కారులో వెళ్లిపోయాడు. ముగ్గురూ కారులో నార్సింగి వచ్చి డబ్బు సరి చూసుకోగా తెల్ల కాగితాలు కనిపించాయి. మోసపోయామని గుర్తించిన జాఫర్‌ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జాఫర్‌ ఒక్కడే పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. మోహిన్, రఫీక్‌ ఎక్కడికి వెళ్లారనే దానిపై పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు జాఫర్‌ను విచారిస్తున్నారు. 

బాధితుడి కాల్‌ డేటా సేకరణ.. 
జాఫర్‌ నుంచి నార్సింగి పోలీసులు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. జాఫర్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. పాతబస్తీ నుంచి ఎప్పుడు వెళ్లాడు, ఎవరెవ్వరితో మాట్లాడాడు అనే విషయాలను సెల్‌ సిగ్నల్స్‌ ద్వారా సేకరిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌పై నుంచి వచ్చామని జాఫర్‌ తెలపడంతో గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట, హిమాయత్‌సాగర్‌ తదితర ప్రాంతాలలోని సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాఫీ డెల్‌ హోటల్‌ సీసీ ఫుటేజీనీ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాలతోపాటు సీసీ ఫుటేజీలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి పాత నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు