శ్రీవారి సేవల పేరిట ఘరానా మోసం

14 Jan, 2019 10:58 IST|Sakshi
రాజ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిషేకాలు చేయిస్తానని నమ్మించి వృద్ధులను మోసం చేసిన వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సందీప్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆనం రాజ్‌కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. అమీర్‌పేట డివిజన్‌ శివ్‌భాగ్‌కు చెందిన సుకుమార్‌రెడ్డితో అతడికి పరిచయం ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతోనే తిరుపతిలో అభిషేక పూజలు, దంపతులకు శేషవస్త్రాలను దగ్గరుండి ఇప్పిస్తానని నమ్మించాడు.

అభిషేక పూజకు రూ.2500, శేషవస్త్రాల బహుకరణకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన సుకుమార్‌ ముందుగా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత అతను నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవచ్చని  స్నేహితులు, బంధువులకు చెప్పడంతో మరో 15 మంది రాజ్‌కుమార్‌రెడ్డికి డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా దర్శనం చేయించకపోగా పత్తా లేకపోవడంతో సుకుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు