అకృత్యం; పొలాల వెంట పరిగెత్తిస్తూ దాడి

24 Sep, 2019 17:07 IST|Sakshi

లక్నో : సామూహిక అత్యాచార ఘటనలో నిందితుడిగా భావిస్తున్న ఓ యువకుడిని గ్రామస్తులు చితక్కొట్టారు. షర్టు పట్టుకుని ఈడుస్తూ.. పొలాల వెంట పరిగెత్తిస్తూ తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేయడంతో శాంతించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కౌశాంబి జిల్లాకు చెందిన ఓ పదహారేళ్ల అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అకృత్యాన్ని కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా తొలుత ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించిన స్థానిక పోలీసులు.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ‘ నేను పళ్ల తోటకు వెళ్లివస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు నాపై దాడి చేశారు. వెనుక నుంచి అకస్మాత్తుగా నన్ను కొట్టి లాక్కెళ్లారు. నాతో చాలా నీచంగా ప్రవర్తించారు. భయంకరంగా అకృత్యానికి పాల్పడ్డారు. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ పొలాల్లో పరిగెత్తలేక వాళ్లకు దొరికిపోయాను అని బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న మహ్మద్‌ నజీమ్‌(20) మంగళవారం బాధితురాలి గ్రామస్తుల చేతికి చిక్కాడు. దీంతో అతడిని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మహ్మద్‌ చోట్కా, బడ్కా అనే ఇద్దరు సోదరులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ఐదు బృందాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు