చచ్చిపోయే ముందు చపాతీల కోసం...

3 Jul, 2018 20:52 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డెలివరీ బాయ్‌

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక మరణాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. క్షుద్ర పూజల ప్రభావానికి లోనై మోక్షం కోసమే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రచారం జరగగా.. అది అంతా తప్పని వారిని ఎవరో చంపారని మృతురాలు నారయణ దేవి కూతురు సుజాత ఆరోపించారు. అయితే వారివి ఆత్మహత్యలేనని ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో ఒకరైన లలిత్‌ భాటియానే మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే నారాయణ దేవి కుటుంబ సభ్యులను వారి ఇంట్లో చివరిసారిగా చూసిన డెలివరీ బాయ్‌ రిషి చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ‘మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు 20 చపాతీల కోసం వారు ఆర్డర్‌ చేశారు. 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో చపాతీలు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్లాను. వాళ్లలో ఒక మహిళ తన తండ్రిని నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పింది. నేను వెళ్లిన సమయంలో ఇళ్లంతా సందడిగా ఉంది. వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఎవరూ ఊహించనే లేరంటూ’  రిషి వాపోయాడు. మరికొన్ని గంటల్లో చనిపోతామని తెలిసి కూడా వారంతా అలా ఉండటం తనను విస్తుగొలిపిందని అతడు తెలిపాడు. కాగా నారాయణ దేవి ఇంట్లోని రెండు రిజిస్టర్లలో లభ్యమైన కాగితాల్లో మోక్షం పొందాలంటే చనిపోయే రోజు ఇంట్లో భోజనం వండకూడదని వారు పెట్టుకున్న నియమం ప్రకారమే చపాతీలను ఆర్డర్‌ చేసినట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు