బదిలీ చేయలేదని కక్ష కట్టాడు ! 

2 Mar, 2020 10:59 IST|Sakshi
నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి

ఆయన పేరుతో నకిలీ ఈ–మెయిల్‌ సృష్టి

కంపెనీకి వ్యతిరేకంగా కస్టమర్లకు మెయిల్స్‌

నిందితుడిని పట్టుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీస్

సాక్షి, సిటీబ్యూరో: పిల్లల చదువు కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బదిలీ కోరాడు ఓ మేనేజర్‌....దీనికి జనరల్‌ మేనేజర్‌ అంగీకరించకపోవడంతో ఉద్యోగం వదిలేశాడు...ఆ జీఎం ఉద్యోగం పొగోట్టాలని కుట్ర చేసి తానే ఇరుక్కున్నాడు..సంస్థ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  కేసు నమోదు చేసుకున్నారు...నకిలీ ఈ–మెయిల్‌ సృష్టించడం ద్వారా సైబర్‌ నేరానికి పాల్పడిన ఆ మాజీ ఉద్యోగిని  పట్టుకున్నారు. ఇతన్ని నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు. బేగంపేట కేంద్రంగా పని చేసే వసంత్‌ కెమికల్స్‌ సంస్థకు నగరంలోని జీడిమెట్లతో పాటువిశాఖపట్నంలో తయారీ యూనిట్స్‌ ఉన్నాయి. ఈ సంస్థ దేశంతో పాటు విదేశాల్లోని అనేక పరిశ్రమలకు రసాయనాలు సరఫరా చేస్తుంటుంది. వసంత్‌ కెమికల్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్‌కు సత్యనారాయణ జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇదే యూనిట్‌లో అనకాపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌గా పని చేసే వారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన శ్రీనివాస్‌ కొన్నాళ్ళుగా వసంత్‌ కెమికల్స్‌లోని విధులు నిర్వర్తిస్తున్నారు. (తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం)

శ్రీనివాస్‌రెడ్డి తన పిల్లల చదువు నిమిత్తం తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాలంటూ పలుమార్లు సత్యనారాయణను కోరారు. అయితే అనివార్య, పరిపాలన కారణాల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదు. దీంతో గత ఏడాది డిసెంబర్‌ 31న శ్రీనివాస్‌రెడ్డి వసంత్‌ కెమికల్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే తనను బదిలీ చేయకపోవడానికి, రాజీనామా చేయడానికి జీఎం సత్యనారాయణే కారణమనే భావనలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ఆయనపై కక్షకట్టారు. ఎలాగైనా ఆయన ఉద్యోగం కూడా పోగొట్టాలనే కుట్రపన్ని సత్యనారాయణ పేరుతో ఓ నకిలీ ఈ–మెయిల్‌ ఐడీ సృష్టించారు. దీన్ని వినియోగించి వసంత్‌ కెమికల్స్‌ నుంచి నిత్యం రసాయనాలు ఖరీదు చేసే విదేశీ పరిశ్రమకు మెయిల్‌ పంపారు. తాము తయారు చేస్తున్న ఉత్పత్తులు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదని, ఇకపై వాటిని ఖరీదు చేయవద్దంటూ అందులో ఆరోపించాడు. దీన్ని అందుకున్న విదేశీ సంస్థ విశ్వసనీయతను సందేహించింది. (బాలునిపై అమానుషం )

అనుమానాలు నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో వసంత్‌ కెమికల్స్‌ను సంప్రదించింది. దీని యాజమాన్యం సత్యనారాయణ నుంచి వివరణ కోరడంతో అది ఆయన పేరుతో సృష్టించిన నకిలీ ఈ–మెయిల్‌గా తేలింది. దీంతో వసంత్‌ కెమికల్స్‌ యాజమాన్యం గత వారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. సదరు ఈ–మెయిల్‌ సృష్టించడానికి, మెయిల్‌ పంపడానికి వినియోగించిన ఐపీ అడ్రస్‌ల ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి నిందితుడిగా తేల్చారు. ఆయన్ను పట్టుకున్న దర్యాప్తు అధికారులు నిందితుడిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నేరానికి సంబంధించి   పక్కా ఆధారాలు సేకరించడం ద్వారా దర్యాప్తు పూర్తి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

చదవండి :ఘోరం: చిన్నారిని బలి తీసుకున్న చిరుత 

మరిన్ని వార్తలు