మణప్పురంలో మాయాజాలం

5 Mar, 2019 13:03 IST|Sakshi
నెక్లెస్‌ మూడు 3.30 తులాల బరువు ఉందని చూపుతున్న ధర్మకాటా స్లిప్పు ,మణప్పురం కార్యాలయం

బంగారు తూకంలో తేడా  

తాడిపత్రి అర్బన్‌: మణప్పురం గోల్డ్‌లోన్‌ కార్యాలయంలో సిబ్బంది బంగారు ఆభరణాలు తూకం వేయడంలో మాయాజాలం ప్రదర్శించారు. పరిమాణం తగ్గించి చెప్పడంతో బాధితుడు అనుమానం వచ్చి తనకు బంగారు నగ విక్రయించిన వ్యాపారి ద్వారా ‘ధర్మ కాటా’ వేయించడంతో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకెళ్తే.. తాడిపత్రి పట్టణంలోని అశోక్‌పిల్లర్‌ వద్ద తోపుడుబండిపై పండ్ల వ్యాపారం చేసుకున్న పెద్దన్నకు డబ్బు అవసరమై బంగారు నెక్లెస్‌ను తాకట్టు పెట్టేందుకు సోమవారం యల్లనూరు రోడ్డు సర్కిల్‌లో ఉన్న మణప్పురం గోల్డ్‌లోన్‌ కార్యాలయానికి వెళ్లాడు. సిబ్బంది సదరు నగను తూకం వేసి రెండు తులాలు ఉందని తెలిపి, ఎంత నగదు కావాలి అని అడిగారు.

మూడు తులాల నగను రెండు తులాలే ఉందంటున్నారేంటి..? మీ తూకం తప్పు చూపిస్తోందంటూ పెద్దన్న ప్రశ్నించాడు. అయితే తమది కచ్చితమైన తూకమంటూ సిబ్బంది బుకాయించారు. అనుమానం వచ్చిన పెద్దన్న తనకు నగ తయారు చేయించి ఇచ్చిన దుకాణాదారుడి వద్దకు వెళ్లి తూకం తక్కువ ఉందని వాగ్వాదానికి దిగాడు. అతడు ధర్మకాటాలో తూకం వేయించగా నగ మూడు తులాల పరిమాణం చూపించింది. దీంతో వారిద్దరూ కలసి మణప్పురం గోల్డ్‌లోన్‌ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఈ లోపు పరిస్థితిని ముందే పసిగట్టిన కార్యాలయ సిబ్బంది ఇదివరకు ఉపయోగించిన త్రాసును మార్చి కొత్తది ఉంచారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులను సిబ్బంది లోనికి రాకుండా అడ్డుకున్నారు. బాధితుడి సమక్షంలో బ్రాంచ్‌ మేనేజర్‌ రామభక్తరెడ్డి, సిబ్బందిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ‘మేము ఇక్కడ ఏమీ మాట్లాడం. ఇంతకు మునుపే పోలీసు అధికారులతో మాట్లాడాం’ అని చెప్పడం గమనార్హం.

ఉచిత సలహాతో సరి..
విషయం తెలుసుకున్న పట్టణ సీఐ చిన్న గోవిందు మణప్పురం కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ బాధితుడితో మాట్లాడారు. కార్యాలయం సిబ్బందితో ఆయన బయటే మాట్లాడారు. తూకాల్లో తేడా కాబట్టి తూనికలు, కొలతల శాఖ అధికారుల పరిధిలోని అంశమని తేల్చి, బాధితుడు పెద్దన్నను స్టేషన్‌కు రావలసిందిగా సూచించారు. మార్గమధ్యలోనే బాధితుడితో ఎందుకు వచ్చి న గొడవ అంటూ సంయమనం పాటించి మిన్నకుండాలని చెప్పి పంపించి వేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు